logo

గడ్డాలు పెంచితే రౌడీలేనా?.. టీడీపీ ఎమ్మెల్సీకి మంత్రి అనిల్ కౌంటర్!

ఏపీ శాసన మండలి లో సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను చర్చించడం పై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అనంతరం అచ్చెన్నాయుడు అరెస్టు టీడీపీ సభ్యులు లేవనెత్తడంతో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. బీసీ నేతలను అణచివేయాలని చూస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ జగదీశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అయన వ్యాఖ్యలను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుబట్టారు. అచ్చెన్నాయుడు దొంగతనం చేసాడు కాబట్టే అరెస్టు చేశామని చేశారన్నారు. క్రికెట్ బెట్టింగ్ అంశాన్ని టీడీపీ సభ్యులు లేవనెత్తడంతో మంత్రి అనిల్ కుమార్ అందుకు సమాధానమిచ్చారు.

చట్టం అందరికి సమానమే అన్నారు. రూ. 151 కోట్ల అవినీతికి పాల్పడిన వారు బీసీ అయితే అరెస్ట్ చేయకూడదా అని ప్రశ్నించారు. 300 మంది పోలీసులతో అరెస్టు చేసారని టీడీపీ సభ్యులు గగ్గోలు పెడుతున్నారు. ముద్రగడ ఉద్యమం చేస్తే 3 వేల మందితో భయానక వాతావరణం సృష్టించి అరెస్టు చేయించలేదా అని మంత్రి అనిల్ కుమార్ నిలదీశారు. అడ్డొచ్చిన మహిళలపై దాడులకు పాల్పడ్డారన్నారు. తనకు క్రికెట్ బెట్టింగ్ విషయంలో నోటీసులు అందిన విషయం నిజమేనని కానీ ఈ వ్యవహారంలో తనకు క్లీన్ చిట్ లభించనుందన్నారు.

కేవలం తనను అప్రతిష్టపాలు చేయడానికే నోటీసులు పంపారన్నారు. వైసీపీ మంత్రుల భాషపై అంతటా చర్చ జరుగుతుందని, గడ్డాలు పెంచుకుని రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గడ్డాలు పెంచుకుంటే రౌడీలేనా మరి చంద్రబాబు కూడా గెడ్డం పెంచారని కౌంటర్ ఇచ్చారు. పురాణాల్లో ఋషులు, మునులు కూడా గడ్డాలు పెంచారని వారంతా కూడా రౌడీలేనా అంటూ అనిల్ కుమార్ దీపక్ రెడ్డిని ప్రశ్నించారు. సభ్యుల వాడివేడి చర్చల కారణంగా సభ వాయిదా వేస్తున్నట్టుగా ఛైర్మెన్ షరీఫ్ ప్రకటించారు.

Related News