తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తుండటంతో పెళ్లి పీటల మీద నుంచే 100 కు డయల్ చేసిన వధువు పోలీసుల సహాయంతో బలవంతపు పెళ్లి నుంచి తప్పించుకుంది. మహబూబాబాద్, మరిపెడ గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వైరల్ గా మారింది. పెళ్లి కూతురు పెళ్లి ఇష్టం లేదని చెప్పడంతో వరుడికి అదే పెళ్లికి వచ్చిన మరో యువతిని ఇచ్చి వివాహం చేసారు.
ఇక పెళ్లి పీటల నుంచి వెళ్ళిపోయిన యువతి మరో ట్విస్ట్ ఇచ్చింది. మరుసటి రోజునే తాను ప్రేమించిన యువకుడిని గుడిలో పెళ్లి చేసుకుంది. దీంతో ఈ పెళ్లి కథ సుకాంతం అయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. మరిపెడ మండలం గుండెపుడికి చెందిన యామిని కృష్ణమూర్తి, రంగమ్మ దంపతుల కుమారుడు యామిని రాజేశ్‌కు, కురవి మండలం కాంపెల్లికి చెందిన దివ్యతో పెద్దల సమక్షంలో వివాహం నిర్ణయించారు.
అయితే దివ్య అప్పటికే కాంపెల్లి గ్రామానికి చెందిన కొల్లు నరేశ్‌ను ప్రేమించినట్లు చెప్పింది. అయినా తల్లిదండ్రులు వినకుండా పెళ్లి చేస్తుండటంతో గౌరీ పూజ చేస్తూనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే అదే పెళ్ళికి వచ్చిన మరో యువతిని ఇచ్చి వరుడు రాజేష్ కు అదే పందిరిలో పెళ్లి చేసారు. ఇక ప్రేమించిన యువకుడి కోసం పెళ్లి కాదనుకున్న దివ్య మహబూబాబాద్ మండలం అనంతారం జగన్నాథ వెంకటేశ్వర ఆలయంలో ప్రియుడిని వివాహం చేసుకుంది.