logo

గుడి లేదు.. విగ్ర‌హాలు ఉండ‌వు.. మేడారం జాత‌ర చ‌రిత్ర‌

ప్ర‌పంచంలోనే అతి పెద్ద గిరిజ‌న జాత‌ర‌గా, ఆసియాలోనే అతి పెద్ద జాత‌ర‌గా పేరు గాంచింది మేడారం స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ జాతర‌. రెండేళ్ల‌కు ఒక‌సారి నాలుగు రోజుల పాటు జ‌రిగే ఈ జాత‌రకు కోట్లాది మంది జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తుంటారు. ఇసుకేస్తే రాలనంత జ‌నం అనే మాట‌ మేడారం జాత‌రలో నిజంగా క‌నిపిస్తుంది. మారుమూల గిరిజ‌న గూడెంలో జ‌రిగే ఈ వ‌న‌దేవ‌త‌ల జాత‌ర‌కు వివిధ రాష్ట్రాల నుంచి భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. ఈ సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ నుంచి 19వ తేదీ వ‌ర‌కు మేడారం జాత‌ర ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది. మేడారం జాతర చ‌రిత్ర‌, స‌మ్మ‌క్క – సార‌ళ‌మ్మ ధీర‌త్వం, జాతర ప్ర‌త్యేక‌త‌ను ఈ వీడియోలో చూద్దాం.

13వ శతాబ్దంలో పొల‌వాస అనే ప్రాంత‌ గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్కను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం జ‌రిపిస్తారు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు.. మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. మేడారాన్ని పాలించే “పగిడిద్దరాజు” కాకతీయుల సామంతునిగా ఉంటూ మేడారంలో పాల‌న సాగిస్తుంటారు. ఇక్క‌డి నుంచి కాక‌తీయ రాజుల‌కు క‌ప్పం క‌డుతుంటారు. అయితే, కరువు కాటకాల వ‌ల్ల ప్ర‌జ‌లు క‌ప్పం క‌ట్ట‌లేక‌పోతారు. దీంతో ప‌గిడిద్ధ‌రాజు కూడా కాక‌తీయుల‌కు కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో కాక‌తీయ రాజుల‌కు వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో పగిడిద్దరాజుపై కాక‌తీయ‌రాజు ప్రతాపరుద్రుడికి ఆగ్ర‌హం పెరుగుతుంది. ప‌గిడిద్ధ‌రాజును అణచివేయడానికి తన సైన్యంతో మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

కాక‌తీయ రాజ్యంతో త‌ల‌ప‌డే శ‌క్తి లేక‌పోయినా ప‌గిడిద్ద‌రాజు వెనుకంజ వేయ‌లేదు. ఆత్మ‌గౌరవంతో పోరుకు సిద్ధ‌మ‌య్యారు. సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు, సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న, గోవిందరాజులు స్థానిక గిరిజ‌నుల‌తో క‌లిసి వేర్వేరు ప్రాంతాల నుండి కాక‌తీయ సైన్యంపై యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. కాని సుశిక్షితులైన, అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి సంపెంగవాగు.. జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది.

ఇక సమ్మక్క యుద్ధ భూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పు తిప్పలు పెడుతుంది, వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాప రుద్రుడు ఆశ్చర్య చకితుడయ్యాడు. చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలుకల‌గుట్టవైపు వెళుతూ మార్గ మధ్యంలోనే అదృశ్యమైంది. సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్లిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు, కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు, కుంకుమలు లభించింది. దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

త‌మ కోసం ప్రాణాలు అర్పించిన స‌మ్మ‌క్క కుటుంబాన్ని గిరిజ‌నులు ఆనాటి నుంచి దైవంగా భావిస్తున్నారు. మేడారంలో గ‌ద్దెలపై అమ్మ‌వార్ల‌కు గుర్తుగా ప‌సుపు, కుంకుమ పెట్టి పూజిస్తున్నారు. మేడారంలో ఎలాంటి గుడి ఉండ‌దు. కేవ‌లం గ‌ద్దెల‌పైన అమ్మవార్ల ప్ర‌తిరూపంగా కుంకుమ‌, భ‌ర‌ణి ఉంటాయి. వీటికే పూజ‌లు కొన‌సాగుతాయి. మొద‌ట కేవ‌లం గిరిజ‌నులే అమ్మ‌వార్ల‌ను పూజించేవారు. క్ర‌మంగా గిరిజ‌నేత‌రులు కూడా అమ్మ‌వార్ల‌ను కొలుచుకోవ‌డం ప్రారంభ‌మైంది. స‌మ్మ‌క్క – సార‌ల‌మ్మ‌ల‌ను కొలిస్తే క‌ష్టాలు తీరుతాయ‌నేది ప్ర‌జ‌ల న‌మ్మ‌కం. అందుకే జాత‌ర స‌మ‌యంలో కోట్లాది మంది భ‌క్తులు త‌ర‌లివ‌స్తుంటారు. కోరిన కోర్కెలు తీరిన త‌ర్వాత అమ్మ‌వారికి ఎత్తు బంగారాన్ని(బెల్లం) స‌మ‌ర్పించుకొని మొక్కులు తీర్చుకోవడం ఇక్క‌డ ఆన‌వాయితీజ‌

నాలుగు రోజుల పాటు మేడారం జాత‌ర జ‌రుగుతుంది. జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకలగుట్టలో భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రం ఆవాహన పలికి దేవతలు ఇద్దరినీ తిరిగి క‌న్నెప‌ల్లికి, చిలుక‌ల‌గుట్ట‌కు పంపిస్తారు. వంశపారంపర్యంగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత.

Related News