బెట్టింగ్‌లకు బానిసైన ఓ యువకుడు డబ్బుల కోసం కన్న తల్లి, సోదరిని విషం పెట్టి హతమార్చాడు. మేడ్చల్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనంగా మారింది. రావలకోల్ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డి ఓ ప్రైవేటు ఉద్యోగి. ఐపీఎల్ బెటింగులకు అలవాటు పడి జులాయిగా తిరుగుతూ జల్సాలు చేసేవాడు.
ఇటీవల అతని తండ్రి ప్రభాకర్ రెడ్డి అకాల మరణం చెందాడు. దీంతో అతని పేరిట రూ. 20 లక్షల ఇన్స్యూరెన్స్ డబ్బు వచ్చింది. ఆ డబ్బంతా జల్సాలకు ఖర్చు చేసాడు. తండ్రి ఇన్స్యూరెన్స్ డబ్బులు ఎక్కడని తల్లి, సోదరి అడుగుతారని భయం అతడిని వెంటాడింది. దీంతో వారిద్దరినీ హతమార్చాలని పథకం వేసాడు.
అందుకోసం ఈ నెల 23వ తేదీన ఉదయం వండిన అన్నంలో విషం కలిపాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం తన టిఫిన్ బాక్సులో వేరే అన్నం పెట్టుకున్నాడు. అనంతరం ఆఫీసుకు వెళ్ళిపోయాడు. విషం కలిపిన అన్నం తిన్న తల్లి సునీతారెడ్డి(42), సోదరి అనుష(20)లు అస్వస్థతకు గురయ్యారు.
వెంటనే కుమారుడు సాయినాథ్ రెడ్డికి ఫోన్ చేసి తాను తీసుకెళ్లిన అన్నం తినవద్దని హెచ్చరించారు. అప్పటికే వారి చావు కబురు కోసం ఎదురుచూస్తున్న సాయినాథ్ రెడ్డి సాయంత్రం తీరిగ్గా ఇంటికి చేరుకున్నాడు. తల్లి, సోదరి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వారిద్దరినీ గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సునీత ఈ నెల 27న మరణించగా సోదరి అనూష 28వ తేదీ మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు