logo

  BREAKING NEWS

మహిళలు పీరియడ్స్ సమయంలో వాక్సిన్ తీసుకుంటే ప్రమాదమా?  |   బీపీ, షుగర్ ఉన్నవారు వాక్సిన్ వేసుకోవచ్చా..?  |   కోవిడ్ చికిత్సకు కొత్త మందు.. ఆమోదించిన డీసీజీఐ, ఒక్క డోసుతో కరోనా ఆటకట్టు  |   కరోనా రోగులకు ఆక్సిజన్ స్థాయిలు అమాంతం పెంచే టెక్నిక్.. సూచించిన ఆరోగ్య శాఖ  |   మళ్ళీ తగ్గిన బంగారం ధరలు: 24.04. 2021 బంగారం, వెండి ధరలు  |   మౌత్ వాష్ లతో తగ్గుతున్న కరోనా ముప్పు.. నోట్లోనే వైరస్ ఖతం!  |   రూ. 50 వేల ప్రారంభ వేతనంతో.. డీఎఫ్‌సీసీఐఎల్ ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఉద్యోగాలు  |   కరోనా రోగులకు శుభవార్త: ఇంట్లోనే ఆక్సిజన్.. ఈ ఒక్కటి ఉంటె చాలు!  |   కరోనా తిప్పలు తీరుస్తున్న ‘తిప్పతీగ’.. మహమ్మారికి దివ్యౌషధం, కరోనా సోకినా ఏమీ చేయలేదట!  |   కరోనా బారిన పడ్డారా? చికిత్స ఎలా? ఆక్సిజన్ ఎక్కడ దొరుకుతుంది? ఆసుపత్రుల వివరాలు అన్నిటికీ ఒకటే యాప్  |  

మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్: చరిత్ర మరువని రియల్ హీరో స్టోరీ!

2008 నవంబర్‌26… దేశ వాణిజ్య రాజధాని పై జరిగిన ఉగ్ర దాడికి దేశం మొత్తం చిగురుటాకులా వణికిపోయింది. ముంబై తాజ్ హోటల్ పై ఉగ్రవాదులు ఓ సైన్యంలా వచ్చి విరుచుకుపడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది చనిపోగా వారిలో 18 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. కాల్పుల ధాటికి వేల మంది గాయపడ్డారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రజలను రక్షించే క్రమంలో ధైర్యసాహసాలకు మారుపేరైన ఎంతో మంది ఆర్మీ అధికారులను దేశం పోగొట్టుకోవలసి వచ్చింది. ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఈ దాడిని ఖండించాయి.

పాకిస్తాన్‌ నుంచి లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందిన 10 మంది ఉగ్రవాదులు సముద్రమార్గం నుంచి ముంబైకి చేరుకొని అమాయక ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ మహల్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, కామా హాస్పిటల్, నరిమన్ హౌస్ యూదు కమ్యూనిటీ సెంటర్ వంటి 12 ప్రముఖ ప్రదేశాల్లో ఉగ్రవాదులు ఏకధాటిగా కాల్పులు జరిపారు. రంగంలోకి దిగిన భద్రతా సిబ్బంది దారుణకాండకు పాల్పడిన పదిమంది ముష్కరుల్లో 9 మందిని హతమార్చగా, ఉగ్రవాది కసబ్‌ను మాత్రం ప్రాణాలతో పట్టుకున్నారు.

ఈ మారణహోమానికి 12 ఏళ్ళు పూర్తయ్యాయి. ఇప్పటికీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర జవాన్లను దేశం గౌరవించుకుంటుంది. ఈ ఉగ్రదాడిలో అమరులైన వారిలో ఉగ్రవాద నిరోధక దళం (ఎటిఎస్‌) చీఫ్‌ హేమంత్ కర్కరే, ముంబై అదనపు పోలీసు కమిషనర్ అశోక్ కామ్టే, సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌ విజయ్ సలాస్కర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ (ఎఎస్ఐ) తుకారాం ఓంబుల్‌ తో పాటుగా 31 ఏళ్ల మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ కూడా ఉన్నారు. ఈ ఆపరేషన్ ప్రాణాలు అర్పించిన మొదటి సోల్జర్ అతనే. మేజర్ మరణవార్త భారత ఆర్మీ అధికారుల రక్తం మరిగేలా చేసింది. ఇంకొక్క కమాండోను కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేని అధికారులు మెరుపు వేగంతో తాజ్ లోకి దూసుకెళ్లారు. ఉగ్రవాదులను ఏరివేసారు.

భారత ప్రభుత్వం మేజర్ ఉన్నికృష్ణన్ సేవలకు అత్యుత్తమ పురస్కారమైన అశోకచక్రతో సత్కరించింది. తాజ్ హోటల్ ను ఉగ్రవాదులు చుట్టుముట్టారన్న వార్త తెలిసిన వెంటనే మానేసర్ నుంచి మూడు విమానాల్లో బ్లాక్ క్యాట్ కమెండోలు ముంబై చేరుకున్నారు. అందులో 100కు పైగా కమాండోలు తాజ్ హోటల్ ను చుట్టుముట్టారు. 600 లకు పైగా గదులున్న తాజ్ హోటల్ లో సీసీటీవీ కవరేజీ డిస్ కనెక్ట్ అయ్యింది. తాజ్ ప్యాలెస్ లో ఉన్న సిబ్బంది మొత్తం బయటకు వచ్చేయడంతో ఏ గదిలో ఎంతంది ఉన్నారనే విషయం కమాండోలకు తెలియలేదు. ప్రతి గదికి ఫోన్ చేసినా ఉగ్రవాదులని అనుకుని ఎవ్వరూ ఫోన్ ఎత్తలేదు.

అప్పుడే ఓ డాటా ఎంట్రీ మహిళా ఉద్యోగి ఫ్లోరిస్ మార్టిస్ ఒక గదిలో చిక్కుకొని ఉన్నారని తెలిసింది. ఆమెను ఎలాగైనా సురక్షితంగా రక్షించి తీసుకువస్తానని మేజర్ ఉన్నికృష్ణన్ చెప్పారు. మేజర్ తో పాటు మరో ఆరుగురు సభ్యులు ప్యాలెస్ లోకి వెళ్లారు. మెట్లవైపు వెళుతున్న సమయంలో ఉన్నికృష్ణన్ తో ఉన్న సునీల్ యాదవ్ పై కాల్పులు జరిగాయి. కమాండోలను కవర్ చేయడానికి ఉన్నికృష్ణన్ కుడివైపు నుంచి ముందుకు వెళ్లి కాల్పులు జరిపే వారిని వెనుక నుంచి పట్టుకుందామని అనుకున్నారు. కానీ కాల్పులు జరిపేవారు అక్కడ కూడా ఉన్నారు. అప్పుడే ఓ బుల్లెట్ ఉన్నికృష్ణన్‌ శరీరంలోకి దూసుకెళ్లింది.

మరుసటిరోజు ఉదయం ఉన్నికృష్ణన్ ను వెతుకుతూ వెళ్లిన అధికారికి పాల్ లాంజ్ దగ్గర నల్లటి ఒక ఆకారం నేలపై పడి ఉన్నట్టుగా కనిపించింది. అది ఉన్ని కృష్ణన్ డెడ్ బాడీ. కుడి చేయి నేలపై, ఎడమ చేయి ఛాతీపై ఉంది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన శరీరం పై ఎడమవైపు వెనుకభాగంలో బులెట్లు దూసుకుపోయి ఉన్నాయి. తలపై నుంచి రెండు బుల్లెట్లు వెళ్లిన ఆనవాళ్లు ఉన్నాయి. తాను చివరి సారిగా వేసిన గ్రానైట్ పిన్ తన చిటికిన వేలుకే ఉంది. రెండడుగుల దూరంలో ఆయన వాకీ టాకీ పడి ఉంది. ఉన్నికృష్ణన్ బృందం ఉగ్రమూకలను వసాబీ రెస్టారెంట్ దగ్గరే నిలిపివేయడంతో విజయవంతం అయ్యారు. ”మీరు పైకి రావద్దు నేను చూసుకుంటాను”. ఇది మేజర్ ఉన్ని కృష్ణన్ నోటి నుంచి వచ్చిన ఆఖరి మాటలు. అవి ఆఖరి క్షణాల్లో ఆయన ఎంతటి ధైర్యసాహసాలను చూపారో తెలియజేస్తాయి. మేజర్ గొప్పతనం గురించి చెప్పాలంటే ఆయన 30 ఏళ్ల జీవితం గురించి తెలుసుకోవాల్సిందే..

ఉన్ని కృష్ణన్ కేరళకు చెందిన వారు. వారి కుటుంబం బెంగుళూరులో స్థిరపడింది. ఉన్ని కృష్ణన్ చిన్ననాటి నుంచే భారత సైన్యం పట్ల ఆకర్షితులయ్యారు. అయన పాఠశాలకు కూడా మిలటరీ క్రాఫ్ చేయించుకునే వెళ్లేవారంటే ఆయనకు తన వృత్తిపట్ల ఉన్న ఇష్టం తెలుస్తుంది. మేజర్ తండ్రి ఇస్రోలో పనిచేసేవారు. దీంతో తాను కూడా దేశానికి సేవచేయాలని కళలుకన్నారు. సినిమాలంటే ఆయనకు చాలా ఇష్టం. బిఎ పూర్తి చేసిన తర్వాత 1995 లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. బీహార్ రేజు వెంట్ లోని 7వ బెటాలియన్ లో లెఫ్టినెంట్ గా పదవీ బాధ్యతలను స్వీకరించారు సందీప్. 1999 నుంచి జమ్మూ కాశ్మీర్, డార్జిలింగ్, రాజస్థాన్ వంటి ఇతర ప్రాంతాల్లో భారత సైన్యంలో పనిచేసారు. కార్గిల్ యుద్ధ సమయంలో కూడా భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ విజయ్ లోను, కౌంటర్ ఇన్సర్జెన్సీ లాంటి అతి కీలకమైన మిషన్స్ ను పూర్తి చేసారు. ఆ తరువాత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ విభాగానికి బదిలీ అయ్యారు. 2006 లో ఎన్ ఎస్ జీ కమాండో సర్వీసులో చేరి దూసుకుపోయారు.

2007 స్పెషల్ యాక్షన్ గ్రూప్స్ ఇంస్ట్రుక్టింగ్ గ్రేడింగ్ ఆఫీసర్ గా పనిచేసారు. మిలటరీ లో అత్యంత కఠినమైనదిగా చెప్పే ఘటక్ ట్రైనింగ్ ను పూర్తి చెయయడమేకాక అందులో టాపర్ గా కూడా నిలిచారు. సందీప్ జీవితం లాగానే ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో ప్రత్యేకమైనది. ఆయన చురుకుదనం గురించి తోటి అధికారులు చర్చించుకునేవారు. నిస్వార్థ, ఉదార స్వభావం ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరు. మేజర్ సందీప్ జీవితంలో ఆఖరి ఆపరేషన్ అయిన బ్లాక్ టొర్నాడో కు నాయకత్వం వహించారు. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కాపాడారు. అతి చిన్నవయసులోనే దేశం కోసం ప్రాణాలు వదిలిన ఈ యోధుడి మరణ వార్త విని దేశవాసులు కంట తడి పెట్టారు. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ బెంగుళూరు లోని ఓ ముఖ్యప్రాంతంలో ఉన్న రోడ్డుకు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరు పెట్టుకున్నారు. అధికారిక లాంఛనాలతో భారత ప్రభుత్వం మేజర్ అంత్యక్రియలను నిర్వహించింది. ముంబై ఉగ్రదాడుల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా మేజర్ ఉన్ని కృష్ణన్ పేరు కచ్చితంగా వినిపిస్తుంది.

 

 

 

Related News