మహేష్ బాబు తన అభిమానులను మరోసారి పోలీస్ పాత్రలో కనివిందు చేయనున్నాడు. మహేష్ బాబు తన కెరీర్లో ఇప్పటివరకు మూడు సినిమాల్లో పోలీస్ పాత్రల్లో నటించాడు. ఇందులో రెండు సినిమాలు భారీ హిట్ సాధించాయి. ఇప్పుడు మళ్లీ తనకు కలిసివచ్చిన పోలీస్ పాత్రలో నటించేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
సర్కారు వారి పాట తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో మహేష్ బాబు ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. ఇందులో అతడు మంచి విజయం సాధించింది. ఖలేజా కూడా బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టీవీలో వస్తున్నాయంటే మళ్లీ మళ్లీ చూసే తెలుగు ప్రేక్షకులు చాలా మంది ఉన్నారు. అంతలా మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబో సెట్ అయ్యింది.
ఇప్పుడు వీరి కాంబినేషన్లో మూడు సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. మొదట రా ఏజెంట్‌గా మహేష్ కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ, ఇది అండర్ కవర్ ఆఫీసర్ రోల్ అని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రభావం వల్ల షూటింగ్ వాయిదా పడింది.
దీంతో పూర్తి ఫైనల్ స్క్రిప్ట్ తయారుచేసే పనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం పార్థు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు టాక్. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలోనే వచ్చిన అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పేరు పార్థు. తెలుగు ప్రేక్షకులకు ఇది బాగా తెలిసిన పేరు. పైగా మహేష్‌కు కలిసివచ్చింది కూడా. దీంతో పార్థు టైటిల్ ఖరారు చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా పూజా హెగ్డేను హీరోయిన్గా తీసుకున్నారని టాక్.