సినిమాల్లో హీరోలు చాలా మంది ఉంటారు. కానీ, నిజజీవితంలో హీరోలు కొందరే ఉంటారు. ఆ కొందరిలో ముందు వరుసలో ఉంటారు మహేష్ బాబు. తన సేవా కార్యక్రమాలు, మానవత్వంతో ఆయాన రియల్ హీరోగా నిలుస్తున్నారు. ఏకంగా 1020 మంది చిన్నారులకు సొంత డబ్బులతో గుండె ఆపరేషన్లు చేయించి ప్రాణాలు పోసిన మహేష్ బాబు వారి పాలిట దైవంలా మారారు. ఇంత చేస్తున్నా మహేష్ బాబు ఈ విషయమై పెద్దగా ప్రచారం కోసం ఆరాటపడకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.
తన నటనతో లక్షలాధి మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ బాబు ఇప్పుడు తన మంచి మనస్సుతో అందరి హృదయాల్లో నిలుస్తున్నారు. పిల్లలు గుండె సమస్యలతో జన్మిస్తే ఆ తల్లిదండ్రులు పడే మానసిక వేదన వర్ణనాతీతం. ఇక, ఆ తల్లిదండ్రులు పేదలైతే పిల్లలను కాపాడుకోవడానికి వారు పడే బాధలు మాటల్లో చెప్పలేం. ఇటువంటి వారి ఆవేదనను ఆ దేవుడైనా వింటారో లేదో కానీ మహేష్ బాబు మాత్రం వింటున్నారు. గుండె సమస్యలు ఉన్న పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తున్నారు.
ఆంధ్ర హాస్పిటల్స్‌తో కలిసి మహేష్ బాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవలే 1020వ చిన్నారిగా విజయవంతంగా గుండె ఆపరేషన్ చేయించారు. మహేష్ బాబు ఆపరేషన్ చేయించిన పిల్లలు కోలుకొని కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1020 మంది చిన్నారులకు ప్రాణాలు పోసిన ప్రాణదాత మహేష్ బాబు. సినిమాల్లో బిజీగా ఉంటున్నా మహేష్ ఈ ఆపరేషన్లపై ప్రత్యేక దృష్టి పెడతారు.
మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఈ సేవా కార్యక్రమంలో కీలకంగా పని చేస్తారు. గుండె సమస్యలు ఉన్న చిన్నారులను గుర్తించడం, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం, వైద్యులతో మాట్లాడి ఆపరేషన్లు చేయించడం, డబ్బులు చెల్లించడం వంటివన్నీ నమ్రత శిరోద్కర్ చూసుకుంటారు. అంతేకాదు, ప్రతీ ఆపరేషన్ సమయంలో ఆమె ఆపరేషన్ సక్సెస్ కావాలని, చిన్నారి కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తారు.
పిల్లలకు గుండె ఆపరేషన్లు మాత్రమే కాదు మహేష్ బాబు మరిన్ని సేవా కార్యక్రమాలను సైలెంట్‌గా చేసుకుంటూ సామాజిక బాధ్యతను చాటుకుంటున్నారు. శ్రీమంతుడు సినిమాలో ఒక ఊరిని దత్తత తీసుకొని రీల్ హీరో అనిపించుకున్న మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకొని రియల్ హీరోగానూ నిలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని తన స్వగ్రామం బుర్రిపాలెంతో పాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా సిద్ధాపురం గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్నారు.
ఈ రెండు గ్రామాలను మహేష్ తన స్వంత డబ్బులతో అభివృద్ధి చేస్తున్నారు. గ్రామంలో అనేక మౌళిక సధుపాయాలు కల్పిస్తున్నారు. పాఠశాల భవనాలను నిర్మించారు. గ్రామానికి కావాల్సిన అన్ని పనులను మహేష్ బాబు చేయిస్తున్నారు. మహేష్ దత్తత తీసుకున్న ఈ రెండు గ్రామాల అభివృద్ధి పనులను సైతం ఆయన భార్య నమ్రత శిరోద్కర్ దగ్గరుండి చూసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.