ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వమే కాకుండా పలు వ్యాపార సంస్థలు కూడా చేదోడు అందిస్తున్నాయి. ఈ కోవలోకే చెందుతుంది ఇన్యూరెన్స్ సంస్థ ఎల్ఐసీ. చదువులో ప్రతిభ ఉండి పేదరికం కారణంగా ఉన్నత చదువులు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్లను అందిస్తోంది. ఎల్ఐసీ గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ స్కీమ్ పేరుతో గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఎల్ఐసీ స్కాలర్షిప్ అందిస్తోంది.
2019 – 2020 విద్యా సంవత్సరానికి గానూ ఎల్ఐసీ గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ స్కీమ్‌కు దరఖాస్తులు ఆహ్వానించింది ఎల్ఐసీ. ఇందుకు సంబంధించిన దరఖాస్తు విధానం, అర్హతలు, చివరి తేదీ వంటి వివరాలను వెల్లడించింది. పదో తరగతి, ఇంటర్ కనీసం 60 శాతం మార్కులతో పాసై ఉన్నత విద్య అభ్యసిస్తున్న పేద విద్యార్థులు ఈ స్కాలర్షిప్లు పొందేందుకు అర్హులు.
దేశవ్యాప్తంగా ప్రతి ఎల్ఐసీ డివిజనల్ సెంటర్ పరిధిలో 20 మంది చొప్పున విద్యార్థులకు రెగ్యులర్ స్కాలర్షిప్లను ఎల్ఐసీ ఇస్తుంది. ఇందులో పది మంది బాలురు, పది మంది బాలికలను స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు. ఇదే కాకుండా ప్రతి ఎల్ఐసీ డివిజన్ పరిధిలో మరో పది మంది బాలికలకు ప్రత్యేక స్కాలర్షిప్లను సైతం అందిస్తుంది.
పదో తరగతి కనీసం 60 శాతం మార్కులతో పూర్తి చేసి ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన కాలేజీలు, విద్యాసంస్థల్లో వొకేషనల్ లేదా ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ) కోర్సులు చదువుతున్న వారు ఈ స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసి మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా డిగ్రీ లేదా డిప్లొమా, ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న వారు కూడా ఈ స్కాలర్షిప్లు పొందవచ్చు.
ఎల్ఐసీ గోల్డెన్ జూబిలీ స్కాలర్‌షిప్‌లకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీ దరఖాస్తులు చేసుకోవడానికి చివరి గడువు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి, ఇతర వివరాలకు www.licindia.in వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు. గోల్డెన్ జూబిలీ స్కాలర్‌షిప్‌గా ఎంత నగదు ఇస్తారనేది ఇంకా ప్రకటించలేదు. కానీ, గతంలో మాత్రం రూ.10 వేల చొప్పున ఒక్కొక్కరికి ప్రతీ యేటా స్కాలర్షిప్లను ఎల్ఐసీ గోల్డెన్ జూబిలీ ఫౌండేషన్ అందించింది.