అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ప్రతి చిన్నవిషయాన్ని షేర్ చేసుకోవడం ఇప్పుడు అలవాటుగా మారిపోయింది. అందులో చాలా వ్యక్తిగత విషయాలు కూడా ఉంటుంటాయి . సోషల్ మీడియాను గుడ్డిగా ఫాలో అయితే మన వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతిలో పడే అవకాశం ఉంది. ఆ తర్వాతి పరిణామాలు మనల్ని చిక్కుల్లో పడేయవచ్చు. ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ కు చెందిన 533 మిలియన్ల డేటా లీక్ అయినట్టుగా వార్తలు వచ్చాయి.
ఈ వార్త ఫేస్ బుక్ యూజర్లను ఉలిక్కిపడేలా చేసింది. దీంతో ఇప్పుడు తమ డేటా ఏ డార్క్ వెబ్ లో లీకైందో అనే అనుమానాలు యూజర్లను వెంటాడుతున్నాయి. అలాంటి వారికోసం ఇప్పుడో వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ లో మీ ఫేస్ బుక్ వివరాలను ఇచ్చి లాగిన్ అవ్వడం ద్వారా మీ ఫేస్ బుక్ ఖాతాను ఎవరైనా హ్యాక్ చేసారా? మీ డేటా ఎక్కడైనా లీక్ అయ్యిందా? అనే విషయాలను తెలుసుకోవచ్చు.
అందుకోసం యూజర్లు ముందుగా ”హావ్ ఐ బీన్ పిడబ్ల్యూఎన్ఈడీ” (https://haveibeenpwned.com) అనే వెబ్ సైట్ కు వెళ్ళాలి. అక్కడ ఫేస్ బుక్ రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన ఈ మెయిల్ లేదా ఫోన్ నంబర్ వివరాలను ఇవ్వాలి. ఈ విధంగా మీ సమాచారాన్ని సెర్చ్ చేయడం వలన మీ డేటా లీక్ అయ్యిందో లేదో అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ లో మీరు మీ ఈ మెయిల్, అడ్రస్ ద్వారా మాత్రమే సెర్చ్ చేసే అవకాశం ఉంది.