తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు ఢిల్లీకి చేరాయి. పీసీసీ అధ్యక్ష ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు, పీసీసీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న నాయకులు ఢిల్లీకి వెళ్లారు. నిన్న ఢిల్లీ వెళ్లిన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇవాళ ఉదయం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు సోనియాతో కోమటిరెడ్డి భేటీ జరిగింది.
తాను విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, పార్టీని నమ్ముకొని ఉన్న తనకు పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి కోరినట్లు తెలుస్తోంది. తనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే అధికారంలోకి తీసుకొస్తానని కోమటిరెడ్డి చెప్పినట్లు సమాచారం. ఇందుకు గానూ తన వద్ద ఉన్న ప్రణాళికను, పార్టీని ముందుకు తీసుకెళ్లే ఆలోచనను సైతం ఆమెకు వివరించారు. తనకు కాకపోతే పార్టీని నమ్ముకొని ఉన్న ఎవరైనా నేతకు పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవి ఇస్తే పార్టీ క్యాడర్‌కు తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన సోనియా దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
కాగా, కరోనా వైరస్ నేపథ్యంలో సోనియా గాంధీ అతి ముఖ్యులను మాత్రమే కలుస్తున్నారు. ఇటువంటి సమయంలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చి అరగంట పాటు సమావేశం అవడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమవుతోంది. కోమటిరెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవిపై సోనియా గాంధీ నుంచి భరోసా వచ్చి ఉండవచ్చని లేదా పీసీసీ ఎవరికి ఇచ్చినా తగు ప్రాధాన్యత ఇస్తామనే హామీ ఇచ్చి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు పీసీసీ పదవి ఆశిస్తున్న రేవంత్ రెడ్డి కూడా ఇవాళ ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆయన ఇవాళ రాహుల్ గాంధీని కలవనున్నారు. సీనియర్లకే పీసీసీ పదవి ఇవ్వాలని కోరుతున్న జగ్గారెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలనే దానిపై రాష్ట్ర కాంగ్రెస్‌లో 162 మంది అభిప్రాయాలు తీసుకున్న మాణిక్యం ఠాగూర్ అధిష్ఠానానికి నివేదిక ఇచ్చారు.