తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని వివాహమాడిన మహిళా న్యాయవాది అనంతరం మనస్పర్థలు రావడంతో ఏకంగా భర్తనే అత్యంత దారుణంగా హత్య చేసింది. ఈ ఘటనలో మహిళా న్యాయవాది ఆనందితా పాల్ ను దోషిగా తేల్చిన న్యాయస్థానం ఆమెకు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ సంచలన తీర్పును వెల్లడించింది.
2018 నవంబర్ నెలలో కలకత్తా నగరంలో న్యాయవాది రజత్ డే హత్య సంచలనం సృష్టించింది. ఈ కేసులో అతని భార్య ఆనిందితా పాల్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఆనాటి నుంచి ఈ కేసులో ఆమె నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. తాజాగా ఈ కేసు పై విచారణ చేపట్టిన పశ్చిమ బెంగాల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది.
తన నివాసం లో భర్త రజత్ డే ను ఛార్జింగ్ కేబుల్ మెడకు చుట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్టు రుజువైంది. అంతే కాకుండా కేసు నుంచి తప్పించుకునే క్రమంలో సాక్ష్యాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్టుగా కోర్టు గుర్తించింది. దీంతో నిందితురాలు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది.