ఏపీ మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. కొడాలి నాని దేవినేనిపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం ఉదయం 10 గంటలకు గొల్లపూడి సెంటర్లో దీక్షకు దిగుతానని ప్రకటించిన విషయం తెలిసిందే. దేవినేని ఉమా చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం గొల్లపూడిలో దీక్షకు యత్నించారు.
అదే సమయంలో మంత్రి కొడాలి నాని కూడా దేవినేని సవాలుకు సిద్ధమంటూ గొల్లపూడి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి ఘర్షణలు చోటుచేసుకోకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఇరువర్గాల ఆందోళనల నేపథ్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈలోగా గన్నవరం ఎమ్మెల్యే వంశీ అక్కడకు చేరుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు దేవినేనిని అరెస్టు చేసారు. అయితే దేవినేని ప్రకటనపై తాజాగా కొడాలినాని విరుచుకుపడ్డారు.
బహిరంగ దీక్షకు పోలీసులు ఎలాగో అనుమతులు ఇవ్వరని తెలిసే కావాలనే డ్రామాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. బహిరంగ చర్చకు సవాల్ చేసి ఇప్పుడు ఫోన్ చేసినా స్పందించడంలేదని కొడాలి నాని కామెంట్ చేసారు. దేవినేని ఉమాతో ఎలాంటి చర్చకైనా సిద్ధమంటూ కొడాలినాని సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాట్లాడుతూ…దేవినేని ఉమా చెప్పిన ‘టచ్ చేసి చూడు’ వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు. నిజానికి టచ్ చేసి చూడు సినిమా మాది. మా సినిమా డైలాగులే కాపీ కొడితే ఎలా? అంటూ ఎద్దేవా చేసారు.
ఇటీవల గుడివాడ రొయ్యల చెరువుపై పేకాట ఆడుతూ కొందరు పట్టుబడిన ఘటనలో తనపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు. పేకాట స్థావరాలపై పోలీసులకు సమాచారం ఇచ్చిందే మేమన్నారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే దేవినేని ఉమాకు ఇంటికి వచ్చి బడిత పూజ చేస్తానంటూ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా దేవినేని ఉమా గొల్లపూడి సెంటర్ లో దీక్షకు దిగుతానని ప్రకటించారు. కొడాలి నాని వస్తాడో సీఎం వస్తాడో రావాలని దమ్ముంటే తాను దీక్ష చేస్తున్న సమయంలో టచ్ చేసి చూడాలంటూ దేవి నేని ఉమా సవాల్ చేశారు.