మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అరెస్టుపై ఏపీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 25వ వర్థంతి సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు పై కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలంటూ బాబు చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు.
బతికుండగా ఓ మహానేతను వెన్నుపోటు పొడిచిన ఈయన ఇప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఎన్టీఆర్ సినిమాల్లో నటుడైతే బాబు రాజకీయాల్లో నటుడన్నారు. ఢిల్లీలో చక్రాలు తిప్పానని చెప్పుకునే బాబు ఆయనకు ఎందుకు భారత రత్న తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. చంద్రబాబుకు ప్రపంచ రత్న బిరుదు ఇవ్వాలన్నారు. ఎన్టీఆర్ ను సీఎం సీటు నుంచి దింపిన వ్యక్తే ఈరోజు దండలేయడం దారుణమన్నారు.
బాబు బతికున్నన్ని రోజులు ఎన్టీఆర్ కు భారత్ రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూనే ఉంటాడు. కానీ అందుకోసం ఎలాంటి ప్రయత్నంచేయరన్నారు. కాగా మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్టుపై కూడా కొడాలి నాని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో టీడీపీ మాజీ మంత్రి, ఓ ఆడబిడ్డ అరెస్టయ్యి జైల్లో ఉంటె ఈరోజు ఒక్క టీడీపీ నేత కూడా ఈ విషయంపై స్పందించకపోవడం దారుణమన్నారు.
అసలు అఖిల ప్రియ ఎవరో తెలియదన్నట్టుగా బాబు ప్రవర్తిస్తున్నారన్నారు. తెలంగాణలో తెరాస, బీజేపీ నేతలతో మాట్లాడే ధైర్యం బాబుకు లేదన్నారు. అదే అఖిల ప్రియను ఏపీలో అరెస్టు చేసి ఉంటె ఈపాటికి ఆడబిడ్డను అరెస్టు చేస్తారా అంటూ టీడీపీ నేతలు రాద్ధాంతం చేసేవారన్నారు.