రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 3,327 గ్రామాలకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 2,635 గ్రామాలను గెలుచుకున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కేవలం 558 స్థానాలతో సరిపెట్టుకుంది. టీడీపీకి దారుణ ఫలితాలు రావడంతో ఆ పార్టీ శ్రేణులు బాధలో ఉండాలి. కానీ, టీడీపీ శ్రేణులు ఫలితాలపై ఖుషిగా ఉన్నారు. మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో టీడీపీ గెలవడమే ఇందుకు కారణం.
టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ అనుకూల మీడియా మొత్తం మిగతా ఫలితాలను పక్కనపెట్టి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీ ఓడిందని, కొడాలికి షాక్ అని అంటున్నాయి. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలో వైసీపీపై టీడీపీ అభ్యర్థి గెలిచారని, ఇది కొడాలి నాని స్వగ్రామం అని ప్రచారం జరిగింది.
ఈ విషయమై మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. యలమర్రు గ్రామం తన పూర్వీకులదని ఆయన పేర్కొన్నారు. తాను, తన తండ్రి గుడివాడలోనే పుట్టామని, తమది గుడివాడనేనని పేర్కొన్నారు. యలమర్రు నియోజకవర్గం పామర్రు నియోజకవర్గంలో ఉంది. యలమర్రు రాజకీయాలు తాను పట్టించుకోనని, తాను అక్కడ ఓటు అడిగినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు.