ఏపీలో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మంత్రి కొడాలి నానికి షోకాజ్ నోటీసులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ మీడియా సమావేశంలో మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలు కించపరి చే విధంగా ఉన్నాయంటూ నిమ్మగడ్డ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు వివరణ ఇవ్వాలంటూ డెడ్ లైన్ విధించారు. కాగా మీడియా సమావేశం తర్వాత తన స్వగ్రామానికి వెళ్ళిపోయిన కొడాలి నాని షోకాజ్ నోటీసులపై స్పందిస్తారా లేదా అనే విషయం ఉత్కంఠ రేపింది. తాజాగా తన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని వివరణ ఇచ్చుకున్నారు. తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు.
ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్ల తనకు గౌరవం ఉందన్నారు. అయితే తన వ్యాఖ్యలను ఆయన తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. తాను ఉద్దేశ్యపూర్వకంగా ఎస్ఈసీని కించపరిచే వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనపై ఎస్ఈసీ ఇచ్చిన షోకాజ్ నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కొడాలి నాని డిమాండ్ చేసారు.