కరోనా వైరస్ ను పసిగట్టి అన్ని దేశాల కంటే ముందుగానే సరిహద్దులు మూసివేసి జాగ్రత్త పడింది ఉత్తర కొరియా. అయినా సుదీర్ఘమైన లాక్ డౌన్ విధించడంతో ఆ దేశం ఆర్థికంగా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒకవైపు కరోనా లాక్ డౌన్ అయితే మరోవైపు ఇటీవల ఆ దేశాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు, ఆధునిక నియంతగా పేరున్న కిమ్ జాంగ్ ఉన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
వరుస ఘటనలతో తీవ్రమైన ఒత్తిడికి లోనైన కిమ్ తమ దేశ పరిపాలనలో కొన్ని కీలక బాధ్యతలను సోదరి కిమ్ యో జాంగ్ కు అప్పగించాడట. ఈ విషయాన్ని ఉత్తర కొరియా దాయాది దేశమైన దక్షిణ కొరియా నిఘా విభాగం గుర్తిచినట్టుగా పేర్కొంది. అయితే కిమ్ కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కిమ్ తర్వాత ఆ దేశానికి అధ్యక్షురాలు అతని సోదరేనని గతంలో కొన్ని వార్తలు హోరెత్తాయి. కిమ్ రాకతో ఈ ప్రచారానికి అడ్డుకట్ట పడింది.
కానీ ఆ దేశ మీడియా ఆమెను ఫోకస్ చేస్స్తున్న తీరు కూడా ఈ సందేహాలకు తావిస్తోంది. అంతేకాదు ఇటీవల అమెరికాతో కిమ్ జరిపిన కీలక చర్చల్లో అతని సోదరి కిమ్ యో ఉంగ్ క్రియాశీలకంగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకున్నారట. అయితే మహిళ కదా అని ఆమెను తక్కువ అంచనా వేయలేమంటున్నారు విశ్లేషకులు. పాలనా పరమైన విధానాలలో అన్నను మించిన వైఖరి కనబరుస్తూ అధికారులను వణికిస్తుందట. ఆమె కిమ్ కన్నా ప్రమాదకారి అనే వాదనలు కూడా ఉన్నాయి.