logo

  BREAKING NEWS

సిటీ బస్సులు నడపొద్దు.. అంతర్‌రాష్ట్ర సర్వీసులపై కేసీఆర్ కీలక నిర్ణయం!

ఆర్టీసీ పై మంగళవారం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అంతర్ రాష్ట్ర బస్సులు నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా నేపథ్యంలో మార్చి మూడో వారంలో అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను నిలిపివేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ సమన్యాయం ప్రాతిపదికన పొరుగు రాష్ట్రాలతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాతే బస్సులు నడపాలని ముఖ్యమంత్రి ఆదేశించించారు.

ఈ వ్యవహారాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్షించనున్నారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుదుర్చుకున్న ఒప్పందాలనే కొనసాగిస్తోంది ప్రభుత్వం. కాగా వీటి కారణంగా రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని గతంలో కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఉదాహరణకు ఎర్రపాలెం-మధిర-విజయవాడ మధ్య 200 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ రూట్లలో తెలంగాణ ఆర్టీసీ బస్సులు నడుపుతుంది.

ఈ రూట్లలో బస్సులు నడపడం వలన ఎలాంటి లాభం లేదు. అదే విజయవాడ-హైదరాబాద్ లకు 200 కిలోమీటర్లకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ బస్సులు నడుపుతుండగా ఇది ఏపీకి లాభదాయకంగా ఉందన్న విషయం గతంలో ప్రస్తావనకు వచ్చింది. ఈ విధమైన అసమానతలు లేకుండా సమన్యాయం ప్రాతిపదికన ఒప్పందం కుదుర్చుకోవాలని కేసీఆర్ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.

అంటే ఆయా రాష్ట్రాల బస్సులు తెలంగాణలో ఎన్ని కిలోమీటర్లు తిరిగితే.. టీఎస్ ఆర్టీసీ బస్సులు కూడా ఆ రాష్ట్రాల్లో అన్ని కిలోమీటర్లే తిరిగే విధంగా ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ప్రధానంగా లాభాలు వచ్చే రూట్లలో ఏపిఎస్సార్టీసి ఎక్కువ బస్సులు నడుపుతుందని, నష్టాలు వచ్చే రూట్లలో తక్కువ సంఖ్యలో నడుపుతుందని గుర్తించారు. కాగా ఇలాంటివి జరగకుండా జాగ్రత్తపడాలని కేసీఆర్ సూచించారు.

మరోవైపు ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపారాలు తెరుచుకోవడంతో ప్రజలు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సిటీ బస్సు సర్వీసుల విషయంపై అధికారులు ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా.. జంట నగరాల్లో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఇప్పట్లో సిటీ సర్వీసులను నడిపించలేమని కేసీఆర్ తెల్చి చెప్పారు.

Related News