టాలీవుడ్లో యదార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కడం కొత్తేమీ కాదు. తాజాగా రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని తీసిన క్రాక్ సినిమా కూడా ఇటువంటిదే. రవితేజకు మంచి హిట్ ఇచ్చిన ఈ సినిమాలో విలన్ పాత్ర అద్భుతంగా పండింది. కటారి అనే ఈ పాత్రలో తమిళ దర్శకుడు సముద్రఖని బాగా నటించారు. సినిమాలోని కటారి అనే పాత్ర నిజజీవితంలోనిది. ఈ విషయాన్ని దర్శకుడు గోపిచంద్ మలినేని స్వయంగా చెప్పారు.
1980లలో ఒంగోలులో జరిగిన కొన్ని సంఘటనలు, పాత్రల ఆధారంగా క్రాక్ సినిమాను తెరకెక్కించారు. కాకపోతే కొన్ని మార్పులు చేశారు. కానీ, కటారి, ఆయన భార్య జయలక్ష్మీ పాత్ర మాత్రం నిజమైనవే. ఒంగోలుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను ఒకప్పుడు వీరు గజగజలాడించారు. సినిమాలో ఈ పాత్ర గురించి పక్కన పెడితే నిజజీవితంలో కటారి కథలో సినిమాను మించిన మలుపులు ఉన్నాయి.
కటారి కృష్ణది ఒంగోలు. ఆయన తండ్రి వ్యవసాయం చేసేవారు. పెద్దగా చదువుకొని కృష్ణ 18వ యేటనే లారీ క్లీనర్‌గా మారాడు. కొంతకాలానికి డ్రైవర్ అయ్యాడు. తోటి డ్రైవర్లకు నాయకుడిగా ఎదిగాడు. ఈ క్రమంలో ఒంగోలు లారీ డ్రైవర్లు రెండు గ్రూపులుగా మారాయి. ఒక గ్రూప్‌కి కటారి కృష్ణ నాయకుడిగా ఉండేవాడు. రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగాయి. ఇవి ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్లాయి.
ఈ ఆధిపత్య పోరులో కటారి కృష్ణ పైచేయి సాధించాడు. దీంతో ఆయన పేరు నగరంలో మారుమ్రోగింది. కటారి కృష్ణ పేరు చెబితేనే ఆ రోజుల్లో ప్రజలు భయపడేవారు. ఒంగోలు నవభారత్ థియేటర్ ఏరియా కటారి కృష్ణకు అడ్డాగా ఉండేది. క్రాక్ సినిమాలో చూపించినట్లుగానే కటారి కృష్ణకు లవ్ స్టోరీ ఉండేది. జయమ్మ అనే యువతిని ఆయన ప్రేమించాడు. కానీ, పెద్దల బలవంతంతో వేరే పెళ్లి చేసుకున్నాడు. మొదటి పెళ్లి చేసుకున్న తర్వాత జయమ్మను విడిచిపెట్టలేక ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు.
కటారి కృష్ణకు అన్ని విషయాల్లోనూ జయమ్మ అండగా ఉండేది. అందుకే కృష్ణతో పాటు జయమ్మ కూడా ఒంగోలు ప్రాంతంలో బాగా ఫేమస్ అయ్యింది. కటారి కృష్ణ, ఆయన ప్రత్యర్థుల మధ్య ఆధిపత్య పోరులో ఒంగోలులో అనేక హత్యలు జరిగాయి. రాజకీయ నాయకులు ఈ గొడవలను, కటారి కృష్ణను ఉపయోగించుకున్నారు. ఆయనతో అనేక పనులు చేయించారు. ఈ క్రమంలో ఓ హత్య కేసులో కటారి కృష్ణ జైలుకు వెళ్లాడు.
కృష్ణ జైలులో ఉన్న సమయాన్ని అదునుగా భావించిన ప్రత్యర్థులు ఆయన రెండో భార్యను హత్య చేశారు. తాను జైళ్లో ఉండటం, తన భార్యను హత్య చేయడం, బయట తన పిల్లలు పడటాన్ని చూసిన కటారి కృష్ణలో పశ్చాత్తాపం మొదలైంది. తాను ఈ రౌడీయిజంలోకి వచ్చి ఏం సాధించాననే ప్రశ్న ఆయనలో మొదలైంది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రౌడీయిజాన్ని వదిలేశాడు.
ఇప్పుడు ఒంగోలులో ఉల్లిపాయలు అమ్ముకుంటూ ఇప్పుడు జీవనం గడుపుతున్నారు. అంతగా రౌడీయిజం చేసి రాష్ట్రంలోనే పేరొందినా, ఒంగోలుని బయపెట్టించినా కటారి కృష్ణ మాత్రం ఆస్తిపాస్తులు, డబ్బులు సంపాదించుకోలేదు. అందుకే ఆయన ఇప్పుడు సాధారణంగా జీవిస్తున్నారు. క్రాక్ సినిమా దర్శకుడు గోపిచంద్ మలినేనిది ఒంగోలు కావడంతో చిన్ననాటి నుంచి కటారి కృష్ణ గురించి తెలుసు. అందుకే ఆయన పాత్రను క్రాక్ సినిమాలో పెట్టాడు.