ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించి పదేళ్లు గడుస్తున్నా ఇంకా టాప్ టాలీవుడ్ హీరోయిన్గా కొనసాగుతోంది కాజల్ అగర్వాల్. 30 ఏళ్ల వయస్సు దాటినా ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస ఆఫర్లతో ఎప్పుడూ బిజీగా ఉంటోంది. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఈ సమయంలోనే ఆమె జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావిస్తోంది. త్వరలోనే ఆమె పెళ్లిపీటలు ఎక్కేందుకు రెడీ అయ్యింది.
ఇప్పటివరకు ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చినా దాటేస్తూ వచ్చిన కాజల్ ఇప్పుడు మాత్రం పెళ్లికి ఓకే చెప్పింది. ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును ఆమె పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ అధికారికంగా ప్రకటించింది. అక్టోబరు 30వ తేదీన ముంబైలో కుటుంబసభ్యులు, దగ్గరి బంధువుల సమక్షంలో తమ పెళ్లి జరగబోతున్నట్లు ఆమె ప్రకటించింది. కరోనా వైరస్ నేపథ్యంలో తక్కువ మంది అతిథుల సమక్షంలోనే పెళ్లి జరుగుతుంది.
గతంలో ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి కాజల్ స్పందిస్తూ… తాను ప్రేమ పెళ్లి మాత్రమే చేసుకుంటానని, అది కూడా సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తిని చేసుకుంటానని ఆమె చెప్పింది. అప్పుడు చెప్పినట్లుగానే ఇప్పుడు కాజల్ సినీ పరిశ్రమకు సంబంధం లేని వ్యక్తినే పెళ్లి చేసుకుంటోంది. అది కూడా ప్రేమ వివాహమే అని తెలుస్తోంది. కాజల్ కాబోయే భర్త 35 ఏళ్ల గౌతమ్ కిచ్లు ముంబైలో వ్యాపారవేత్త. గత నెలలోనే వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది.
గౌతమ్ కచ్లు అమెరికాలోని టఫ్ట్స్ యూనివర్సిటీలో చదువుకున్నారు. తర్వాత ఆయన ఇంటీరియర్ డిజైనింగ్‌కు సంబంధించి డిసెర్న్ లివింగ్ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ-కామర్స్ తరహాలో ఈ కంపెనీ పని చేస్తుందని తెలుస్తోంది. గౌతమ్ కచ్లు కుటుంబం కూడా చాలా రోజులుగా ముంబైలో వ్యాపారరంగంలో బాగా స్థిరపడిందని తెలుస్తోంది. వీరిది ప్రేమవివాహమే అయినా పెద్దలు కూడా అంగీకరించడంతో ఇరుకుటుంబాల ఇష్టప్రకారమే పెళ్లి జరుగుతోంది.
కాగా, కాజల్ ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉంది. కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఇండియన్ – 2లో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న మోసగాళ్లు సినిమాలోనూ కాజల్ హీరోయిన్. మరి, పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటిస్తుందా, నటించదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.