కడప జిల్లాలో మరోసారి వర్గ పోరు భగ్గుమంది. వాట్సాప్ గ్రూపులో తలెత్తిన వివాదం ముదరడంతో ఒకే పార్టీకి చెందిన వ్యక్తుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతన్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం వీరప్పనాయుని పల్లి మండలం పాయసంపల్లిలో జరిగిన న్యూ ఇయర్ కార్యక్రమంలో పాయసం పల్లికి చెందిన నిమ్మకాయల సుధాకర్ రెడ్డి అనే వైసీపీ నేత న్యూ ఇయర్ సందర్భంగా కేక్ కట్ చేసేందుకు సిద్దపడగా.. వైసీపీలోనే మరో వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అందుకు అభ్యంతరం వ్యక్తం చేశాడు.
అంతకుముందు సుధాకర్ రెడ్డి పాయసం పల్లి గ్రామానికి చెందిన వాట్సాప్ గ్రూపులో కొత్త సంవత్సరం శుభాకంక్షాలు తెలిపాడు. అది నచ్చని మహేశ్వర్ రెడ్డి హిందువులు ఉగాదిని మాత్రమే కొత్త సంవత్సరంగా జరుపుకోవాలని న్యూ ఇయర్ ఎందుకు జరుపుకుంటున్నావంటూ అతనితో వాగ్వాదానికి దిగాడు. అయితే ఈరోజు ఉదయం జరిగిన వేడుకల్లో సుధాకర్ రెడ్డి కేక్ కట్ చేయడానికి రాగా ప్రత్యర్థి వర్గం అతనిపై రాళ్లతో దాడి చేసింది.
అతనిపై జరుగుతున్న దాడిని ప్రతిఘటించేందుకు ప్రయత్నించిన సుధాకర్ రెడ్డి తన దగ్గరున్న లైసెన్సుడ్ గాన్ తో గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఇరు వర్గాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గాయపడినవారిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేసారు.