కొన్ని వార్తలు నిజమయ్యే వరకు పుకార్లుగానే ఉంటాయి. కానీ, ఆ వార్తలు అభిమానులను మాత్రం ఫుల్ ఖుష్ చేస్తాయి. ఇది నిజమైతే బాగుండు అనిపిస్తాయి. ఇటువంటి ఒక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. టాలీవుడ్ ఆగ్రహీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఈ వార్త చాలా చాలా సంతోషపెడుతోంది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ హాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నారనేది ఈ వార్త సారాంశం.
హాలీవుడ్లో మనోజ్ నెల్లియట్టు శ్యామలన్ అని ఒక దర్శకుడు ఉన్నారు. ఎం నైట్ శ్యామలన్ అని ఆయనను హాలీవుడ్ పిలుస్తోంది. ఇండియాలోని పాండిచెర్రిలో జన్మించిన మనోజ్ అమెరికాలో పెరిగాడు. భారతీయ మూలాలు కలిగిన ఈ డైరెక్టర్ హాలీవుడ్లో స్థిరపడ్డారు. హాలీవుడ్లో ది సిక్ట్స్ సెన్స్, సైన్స్, స్ల్పిట్ వంటి మంచి సినిమాలు తీసి ప్రత్యేక స్థానం సంపాదించారు.
ప్రస్తుతం మనోజ్ శ్యామలన్ తీయబోతున్న ఒక సినిమాలో పాత్రకు జూనియర్ ఎన్టీఆర్‌కు తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తారక్‌కు ఆయన ఈ ఆఫర్ ఇచ్చాడని, చర్చలు జరుగుతున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. మంచి రోల్ కావడం, అది కూడా హాలీవుడ్లో అయినందున తారక్ కూడా ఈ ఆఫర్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఇందుకు సంబంధించి ఒక ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే, ఇప్పటివరకైతే ఇది ఒక ప్రచారం మాత్రమే. ఎంతమేరకు నిజమనేది త్వరలోనే తెలియాల్సి ఉంది. మనోజ్ శ్యామలన్ మాత్రం హాలీవుడ్లో ఒక సినిమా తీసేందుకు సిద్ధమవుతున్న మాట అయితే వాస్తవం. కాగా, తారక్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్లో తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఒక సినిమా ఉంది. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మరో సినిమా ఒప్పుకున్నారు.