గత ఎన్నికల్లో దారుణ ఓటమితో ఇప్పటికే నైరాశ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో కుటుంబ రాజకీయాలు మళ్లీ తెరపైకి రానున్నాయా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు నిజమే అనేలా ఉన్నాయి. నందమూరి కుటుంబానికి చెందిన తెలుగుదేశం పార్టీని నారా కుటుంబం స్వాధీనంలోకి చంద్రబాబు తెచ్చారు. ఇప్పుడు మళ్లీ టీడీపీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వెళుతుందా అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ పట్ల తెలుగుదేశం పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తోంది. తాతకు తగ్గ వారసుడిగా మంచి చరిష్మా, క్రేజ్ ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. సినిమాల్లోనే ఉంటున్నా కూడా సమాజం పట్ల, రాజకీయాల పట్ల ఆయనకు బాగా అవగాహన ఉంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతున్నారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో తన స్వంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మాట్లాడుతుండగానే టీడీపీ కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలు బహిరంగంగానే ఈ డిమాండ్ చేయడంతో చంద్రబాబు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కుప్పంలోనే టీడీపీ క్యాడర్ మరింత ముందుకెళ్లి జూనియర్ ఎన్టీఆర్ జెండా ఎగరేశారు. కుప్పం మండలం మంకలదొడ్డి పంచాయితీలోని ములకలపల్లి గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుతూ జూనియర్ ఎన్టీఆర్ జెండా ఎగరేవారు.
ఈ జెండా తెలుగుదేశం పార్టీకి భిన్నంగా ఉంది. తెలుపు రంగు జెండాపై జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది. ఈ జెండా గురించి తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల అక్కడక్కడ జూనియర్ ఎన్టీఆర్ను పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్లు పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు బ్యానర్లు కూడా వేస్తున్నారు.
చంద్రబాబు వయస్సురీత్యా ఆయన ఇక యాక్టీవ్ పాలిటిక్స్ చేయలేరనే భావన పార్టీ క్యాడర్లో అంతర్గతంగా ఉంది. చంద్రబాబు తర్వాత నారా లోకేష్ కంటే జూనియర్ ఎన్టీఆర్ అయితేనే టీడీపీని సమర్థంగా నడిపించగలరని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. 2009లో జూనియర్ ప్రసంగాలు, ప్రచారం చూసిన చాలామంది టీడీపీ కార్యకర్తలు ఆయనకు ఫిదా అయిపోయారు. కాబట్టి, ఇప్పుడు టీడీపీ క్యాడర్ జూనియర్ ఎన్టీఆర్పైనే ఆశలు పెట్టుకుంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్కు మాత్రం ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి లేదు. కానీ, భవిష్యత్లో మాత్రం కచ్చితంగా వచ్చే అవకాశాలే ఉన్నాయి.