హోరాహోరీగా జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయంతో భారతీయ జనతా పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎవరనే ఒక పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య సాగుతోంది. రేవంత్ రెడ్డి పీసీసీ కావడంతో కాంగ్రెస్ కొంత ముందున్నట్లు కనిపించింది. కానీ, హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపుతో ఒక్కసారిగా సీన్ బీజేపీకి అనుకూలంగా మారింది. ఇదే సమయంలో రాష్ట్ర రాజకీయాలు మొత్తం టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా సాగుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా తన ప్రెస్ మీట్లతో కాంగ్రెస్‌ను సైడ్‌లైన్ చేసి బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీ కూడా అంతేస్థాయిలో రియాక్ట్ కావడంతో మొత్తం రాజకీయంగా ఈ రెండు పార్టీల మధ్య నడుస్తోంది. దీంతో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందనే భావన కలుగుతోంది. ఇంతకాలంగా ఏ పార్టీలోకి వెళ్లాలో తెలియక రాజకీయాలను గమనిస్తున్న కొందరు నేతలు ఇప్పుడు కాషాయ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్కు బద్ధ వ్యతిరేకిగా మారారు. టీఆర్ఎస్పై బలంగా పోరాడటం లేదనే భావనతోనే ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరిగింది. కానీ, ఆయన బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు సన్నిహితంగా ఉంటున్నారు. హుజురాబాద్‌లో ఈటల విజయం కోసం కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రచారం కూడా చేశారు. ఆయనకు పలువురు బీజేపీ జాతీయ నేతలతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆయనను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఆయన అమెరికా పర్యటనలో ఉన్నారు. తిరిగి వచ్చిన తర్వాత ఆయన బీజేపీలో చేరడం దాదాపుగా ఖాయంగా తెలుస్తోంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్‌కు చాలా రోజులుగా పెద్ద దిక్కుగా ఉన్నారు. జిల్లాలో ఆయన బలమైన నాయకుడు. ఆర్థికంగా బలవంతుడు. ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభ కూడా ఆయనే నిర్వహించారు. అయితే, తన వ్యతిరేకులకు జిల్లాలో ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తితో ఆయన ఉన్నారు. ఇటీవలే ప్రెస్‌మీట్ పెట్టి పార్టీకి డెడ్‌లైన్ కూడా పెట్టారు. నిజానికి ఆయన స్వంతంగా పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా చేశారు. కానీ, బీజేపీ నుంచి ఆహ్వానం రావడం, తగు ప్రాధాన్యత ఇస్తామనే హామీ ఇవ్వడంతో ఆయన ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే బీజేపీలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు చేరిక ఉండనుంది.