ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈరోజు సంక్షేమ పథకాలపై చర్చ జరిగింది. చర్చలో భాగంగా జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ప్రసంగించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదన్నారు. ఇపుడు తండ్రి బాటలోనే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలన సాగిస్తున్నారన్నారు.
సీఎం లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించారు. సచివాలయం ద్వారా ప్రతిగ్రామంలోనూ 30 నుంచి 40 మంది వాలంటీర్లు ఉన్నారు. పేదవారి అవసరాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి పథకాలు అందిస్తున్నారన్నారు. పేదల ఇంటి కల సాకారం చేసింది అప్పట్లో వైఎస్ఆర్.. ఇప్పుడు వైఎస్ జగనే అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం ఇంతలా తపించే ముఖ్యమంత్రిని తానెప్పుడూ చూడలేదన్నారు. 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏనాడూ ప్రజల సంక్షేమం కోసం పని చేయలేదన్నారు.
సీఎం జగన్ ఉన్న సభలో తాను కూడా ఉండటం తన అదృష్టమంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. రాపాక ప్రసంగిస్తున్న సమయంలో సభలో ఉన్న వైసీపీ సభ్యులు బల్లలు చరుస్తూ తమ మద్దతును తెలియజేసారు. రాపాక ప్రసంగిస్తున్న సమయంలో సీఎం జగన్ చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు.