జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ ఎన్నికల రంగంలోకి దిగనున్నారు. ఈ సారి ఆయన తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారు. త్వరలో తెలంగాణలో జరగనున్న దుబ్బాక ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీరోల్ పోషించే అవకాశాలు ఉన్నాయి. ప్రచారపర్వంలోకి పవన్ దిగనున్నారు. గ్రేటర్లో పలు డివిజన్లకు జనసేన పార్టీ తరపున అభ్యర్థులను సైతం బరిలో దింపవచ్చని ప్రచారం జరుగుతోంది.
భారతీయ జనతా పార్టీతో జనసేన పార్టీకి పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బీజేపీ తెలంగాణపై ఎక్కువ దృష్టి పెట్టింది. రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోంది. ఇటువంటి సమయంలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. దుబ్బాక విషయానికి వస్తే.. అక్కడ బీజేపీకి రఘునందన్‌రావు రూపంలో బలమైన అభ్యర్థి ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా టీఆర్ఎస్ – బీజేపీ నడుమనే పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే దుబ్బాకలో బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తోంది. దుబ్బాక తర్వాత డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగబోతున్నాయి. సుమారు కోటి మంది జనాభా నివసించే జీహెచ్ఎంసీ ఎన్నికలు అన్ని పార్టీలకూ కీలకంగా ఉంటాయి. ముఖ్యంగా నగరంలో కొంతబలం ఉన్న బీజేపీ గ్రేటర్ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.
గ్రేటర్లో ఎక్కువ స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో తమ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కూడా రంగంలోకి దింపే ఆలోచనతో బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో ఆంధ్ర సెటిలర్ల జనాభా ఎక్కువగా ఉంటుంది. సుమారు 30 – 40 డివిజన్లలో సెటిలర్ల ఓట్లు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి.
అందుకే 2014 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌తో ఆనాటి బీజేపీ – టీడీపీ కూటమి హైదరాబాద్‌లో ప్రచారం చేయించుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గానీ, జనసేన గానీ నేరుగా ఎన్నికల్లో ఎవరికీ మద్దతు ఇవ్వలేదు. కానీ, హైదరాబాద్‌లో అనధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన టీఆర్ఎస్కు సపోర్ట్ చేశాయి. ఈ రెండు పార్టీలు విడివిడిగా వెనకుండా సెటిలర్లతో కొన్ని మీటింగులు పెట్టి టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించాయి. గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ సీట్లలో టీఆర్ఎస్ విజయానికి ఇది ఎంతోకొంత పనికొచ్చింది.
ఇప్పుడు బీజేపీ కూడా సెటిలర్లతో పాటు నగరంలో పెద్ద ఎత్తున ఉండే పవన్ కళ్యాణ్ అభిమానుల మద్దతు ఆశిస్తోంది. ఇందుకోసం పవన్ కళ్యాణ్‌ను ప్రచారం చేయవలసిందిగా కోరే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయమై బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. అవసరమైతే సెటిలర్లు ఎక్కువగా ఉండే కూకట్పల్లి, కుత్భుల్లాపూర్ వంటి నియోజకవర్గాల్లో కొన్ని డివిజన్లను జనసేనకు కేటాయించి రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని పోటీ చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గ్రేటర్‌లోనే కాదు అవసరమైతే దుబ్బాకలోనూ పవన్‌తో ప్రచారం చేయించుకోవాలనే ఆలోచనతో కొందరు బీజేపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాగూ మిత్రపక్షంగా ఉన్నందున బీజేపీ నేతలు అడిగితే ప్రచారం చేయడానికి పవన్ కాదనకపోవచ్చు.