ఈ మధ్య తరచూ జమిలి ఎన్నికలు అనే పదం వినిపిస్తోంది. ఈ పదం రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశంగా మారుతోంది. ఎందుకంటే కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలని భారీ కసరత్తు చేస్తోంది. ఒకవేళ కనుక కేంద్రం జమిలి ఎన్నికలు నిర్వహిస్తే మన దేశంలో రాజకీయ పరిణామాల్లో పెను మార్పులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జమిలి ఎన్నికలు అంటే ఏమిటి ? అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఒక్క మాటలో చెప్పాలంటే… దేశమంతా ఒకేసారి పార్లమెంటుతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించడాన్ని జమిలి ఎన్నికలు అంటారు. మన దేశంలో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో మొదటిసారి ఎన్నికలు జరిగాయి. అప్పుడు పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత 1957, 1962, 1967 సంవత్సరాల్లోనూ పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి.
అంటే, 1952 నుంచి 1967 వరకు నాలుగు దఫాలు దేశంలో జమిలి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోనే పడిపోవడం, కొన్ని రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, కేంద్ర ప్రభుత్వం పడిపోవడం వంటి అనేక కారణాల వల్ల ఒకేసారి ఎన్నికలు జరిగే జమిలి ఎన్నికల పద్ధతికి బ్రేక్ పడింది. అప్పటి నుంచి పార్లమెంటు పదవీకాలం ముగియగానే పార్లమెంటుకు, ఏ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియగానే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి.
2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చాక జమిలి ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చింది. 2017లో నీతి ఆయోగ్ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఒక నివేదికను ఇచ్చింది. ఈ నివేదికలో కొన్ని మార్పులు చేసి లా కమిషన్ ఆమోద ముద్ర వేసింది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ కచ్చితంగా జమిలి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉంది.
ఇందులో భాగంగా ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. జమిలి ఎన్నికలకు 22 పార్టీలు మద్దతు పలికాయి. అయితే, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలను కనీసం దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాలి. ప్రస్తుతం ఎన్డీఏ 16 రాష్ట్రాల్లో అధికరంలో ఉన్నందున ఇది పెద్ద సమస్యేమీ కాదు. జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతున్న పార్టీల ఎంపీల సంఖ్య లోక్సభలో 440 వరకు ఉంటుందని ఒక అంచనా. రాజ్యసభలోనూ మెజార్టీ సభ్యులు జమిలికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.
కాబట్టి కేంద్రం గనుక ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే కచ్చితంగా నిర్వహించగలుగుతుంది. జమిలి ఎన్నికలు పెట్టాలనే ఆలోచనను సమర్థించుకోవడానికి కేంద్రం ఒక వాదన చేస్తోంది. జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చని కేంద్రం చెబుతోంది. తరచూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల వలన కలిగే ఇబ్బందులు కూడా తప్పుతాయని, ఐదేళ్ల పాటు ఎన్నికలే ఉండకపోతే పాలన బాగా సాగుతుందనేది కేంద్రం వాదన.
అయితే, జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యం, దేశ ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తాయని జమిలి ఎన్నికలను వ్యతిరేకించే పార్టీలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించాలనే బీజేపీ ఆలోచన వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే విశ్లేషణలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించింది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలనే భావన మెజారిటీ ప్రజల్లో ఉందనే విషయం లోక్సభ ఎన్నికల్లో స్పష్టమవుతోంది.
కానీ, రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం ప్రాంతీయ పరిస్థితుల కారణంగా ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్ వైపు కూడా ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు కనుక వస్తే ప్రాంతీయ పరిస్థితులు, రాష్ట్రాలకు సంబంధించిన అంశాల కంటే జాతీయ అంశాలను దృష్టిలో పెట్టుకొనే ఓటరు ఓటు వేస్తాడు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ఉంటే బాగుంటుందనే భావన కూడా ఓటర్లలో ఏర్పడుతుంది. అప్పుడు పార్లమెంటుతో పాటు చాలా రాష్ట్రాలను బీజేపీ గెలుచుకుంటుందని, ఈ ఆలోచనతోనే బీజేపీ జమిలి ఎన్నికలకు ఆసక్తి చూపిస్తోందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహించడం ఖాయమైతే 2022 చివర్లో లేదా 2023 మొదట్లో వచ్చే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా విడతలవారీగా ఒకేసారి జరుగుతాయి.