ప్రపంచం గర్వించదగ్గ సినిమాలు తీస్తున్నా.. ఆస్కార్ పురస్కారం మాత్రం భారత్ కు అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. 2020 అస్కార్ అవార్డులకుగనూ ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీ కింద భారత్ అధికారిక ఎంట్రీగా మలయాళ సినిమా ‘జల్లికట్టు’ ఎంపికైన విషయం తెలిసిందే. ఆస్కార్ ఎంట్రీ కోసం మన దేశం నుంచి మొత్తం 27 సినిమాలకు చోటు దక్కింది.
అందులో జల్లికట్టు కూడా ఒకటి. కానీ మరోసారి ఆస్కార్ ముంగిట మన సినిమాకు నిరాశే ఎదురైంది. పదిహేను సినిమాలను షార్ట్ లిస్టు చేయగా అందులో జల్లికట్టు స్థానం దక్కించుకోలేకపోయింది. గతేడాది సెప్టెంబర్ లో విడుదలైన ఈ సినిమా సినీ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. జంతువులకన్నా మనిషి ఎంత అద్వాన్నమో తెలుపుతూ దర్శకుడు లిజో జోస్ పెల్లిసరీ ఈ సినిమాను తనదైన రీతిలో తెరకెక్కించాడు.
గతంలో మలయాళంలో ఈ దర్శకుడు ‘అంగమలై డైరీస్’, ‘ఈమాయు’ అనే సినిమాల ద్వారా సంచలన దర్శకుడిగా మారాడు. జల్లికట్టు మాత్రం ఊహించని విధంగా ఆస్కార్ రేసులోకి దూసుకొచ్చింది. కానీ చివరకు ఈ రేసు నుంచి తప్పుకుంది. ఈ వార్త జల్లికట్టు పై ఆశలు పెట్టుకున్న అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.