రోజుకో బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే. అయితే కొందరి ఇళ్లలో గోరు వెచ్చని బెల్లం పాకాన్ని చేసుకుని తాగుతుంటారు. ఇలా బెల్లాన్ని పాకంలా చేసుకుని తాగడం వల్ల అందులోని అన్ని పోషకాలు శరీరం గ్రహించుకుంటుందట. బెల్లంలో ఐరన్,యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. బెల్లాన్ని వేడి నీటిలో వేసుకుని వెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల శరీరానికి మెరుగైన ఫలితాలు అందుతాయి.
ఉదయం పూట గోరువెచ్చని బెల్లం పానకం తాగడం వల్ల విసర్జన హాయిగా అవుతుంది. కడుపులోని విషపదార్థాలు బయటకు పోయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బెల్లం శరీర ఉష్ణోగ్రతను స్థిరీకరిస్తుంది. అందుకే చలికాలంలో బెల్లం తినమంటారు. మలబద్ధకం, ఎసిడిటీ సమస్యలను బెల్లం నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బెల్లంలోని ఖనిజాలు, విటమిన్లు సీజనల్గా వచ్చే ఎన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి.
జ్వరం ఇతర అనారోగ్యానికి గురైన వారికి ఇదొక అంచి ఎనర్జీ డ్రింక్ లా పని చేస్తుందని దీనిని వాడేవారు చెపుతున్నారు. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఈ డ్రింక్ అద్భుతంగా పని చేస్తుందని చెప్తున్నారు. అయితే ఈ బెల్లం పాకంలో రుచికోసం కాస్తంత నిమ్మ రసం లేదా మిరియాల పొడిని కూడా కలుపుకోవచ్చు. రక్త హీనత తో బాధపడే అమ్మాయిలకు దీనిని తాగించవచ్చు. అయితే బెల్లం చక్కెరకన్నా ఎన్నో రెట్లు ఆరోగ్యమైనదే అయినా ఇందులో ఉండే తీపి గుణం అందరికి సరిపడకపోవచ్చు. అలాంటి వారు దీనిని తీసుకోకపోవడమే మంచింది. అలాగే డయాబెటిస్ ఉన్న వారికి కూడా ఈ డ్రింక్ ఇవ్వకూడదు.