ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. తాడేపల్లిగూడెం లోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వర్చువల్ విధానం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న జీవ క్రాంతి’ పథకాన్ని ప్రారంభించారు. 45ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు జీవనోపాథి కల్పించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఈ కొత్త పథకాన్ని అమలు చేయనుంది.
ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలలకు మేకలు, గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్ లో మొత్తం 14 మేకలు, గొర్రె పిల్లలు లేదా మేకపోతు లాంటివి ఉంటాయి. గొర్రెలలో నెల్లూరు బ్రౌన్, జోడిపి, మాచర్ల బ్రౌన్, విజయనగరం జాతులు, మేకలలో బ్లాక్ బెంగాల్, లేదా స్థానిక జాతులలో లబ్ధిదారులు తమకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేస్తారు.
ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా 2. 49 లక్షల మేకలు, గొర్రెలు యూనిట్ల పంపిణీ జరగనుంది. మూడు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం రూ. 1868. 63 కోట్ల వ్యయాన్ని ఖర్చు చేయనున్నారు. ఒక్క రైతుకి ఒక్క యూనిట్ ను మాత్రమే అందజేస్తారు. పాడి రైతులు, మహిళలు ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారు.
ఇందుకోసం అల్లానా ఫుడ్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. రవాణా, బీమా వ్యయం కలుపుకుని వీటి ధర రూ. 75 వేలుగా నిర్ణయించారు. 2017 లో తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే తరహా పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తన్న విషయం తెలిసిందే.