ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ చర్యలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది. నిమిషాల వ్యవధిలో నిమ్మగడ్డ వైఖరిపై స్పందించింది. మంత్రిపై ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నప్రభుత్వం ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హై కోర్టుకు వెళ్లనుంది.
హై కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ, రేపు కోర్టుకు సెలవులు కావడంతో హౌస్ మోషన్ పిటిషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కొన్నిరోజులుగా పంచాయతీ ఎన్నికలపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ప్రభుత్వానికి మధ్యన వివాదం నడుస్తున్న విషయం తెలిసందే. కోర్టు తీర్పుతో ఏపీలో పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది.
చిత్తూరు, గుంటూరు జిల్లాలో ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ అనుమానం వ్యక్తం చేసారు. ఆ రెండు జిల్లాల ఏకగ్రీవాల ఫలితాలను ప్రకటించవద్దని అధికారులను ఆదేశించారు. ఆ ఫలితాలని తన దగ్గర పెండింగ్ లో ఉంచారు. ఎన్నికల కమిషనర్ నిర్ణయంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. జిల్లా అధికారులను నిమ్మగడ్డ భయపెట్టి ఏకగ్రీవాలను జరగనీయకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసారు.