ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు ఏదో ఒక ఆసక్తికర అంశం ఉంటూనే ఉంటుంది. తాజాగా ఓ విషయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల మధ్య దూరం పెరిగిందంటూ ప్రచారం జరుగుతుంది. ఇది కొత్త విషయమేమీ కాకపోయినా తాజాగా జరిగిన ఓ ఘటన తో ఇప్పుడు మరోసారి ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
సాధారణంగా ప్రతి ఏటా క్రిస్టమస్ వేడుకలకు పులివెందులలోని సీఎస్ఐ చర్చికి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి హాజరవుతారు. వైఎస్సార్ ఉన్న నాటి నుంచే వారు ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో వైఎస్ కుటుంబం పలువురు సన్నిహితులతో కలిసి పాల్గొన్నారు.
అయితే మొదటిసారి షర్మిల, ఆమె భర్త అనిల్ ఈ వేడుకలకు దూరంగా ఉండటంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. ఆమె అమెరికాలో ఉన్న తన కుమారుడిని కలుసుకునేందుకు వెళ్లడం వల్లే ఈ వేడుకలకు దూరంగా ఉన్నారని తెలుస్తుంది. గతంలో కూడా జగన్, షర్మిలకు మధ్య మనస్పర్థలు వచ్చాయని అనేక సార్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు వైసీపీ వర్గాలు మాత్రం ఆ వార్తల్లో నిజంలేదని ఎన్నో సార్లు ప్రకటించాయి. నిజానికి వైఎస్ జగన్ జైలులో ఉన్న సమయంలో షర్మిల రంగంలోకి దిగి పార్టీని బలోపేతం చేసారు. ప్రజా ప్రస్థానం పేరిట రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత మాత్రం ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. షర్మిల తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారనున్నారనే వార్తల నేపథ్యంలో ఈ తాజా వార్త ఆసక్తికరంగా మారింది.