మనం ఎక్కడ చూసినా కనపడే కలుపు మొక్కల్లో ఒకటి వయ్యారి భామ. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. కొందరు కాంగ్రెస్ గడ్డి అంటారు. మరికొందరు ముక్కుపుల్లాకు గడ్డి అని, అమెరికా అమ్మాయి అని, క్యారెట్ గడ్డి అని కూడా అంటుంటారు. మన రైతులను పీడించే అత్యంత ప్రమాదకరమైన కలుపు మొక్క ఇది. కానీ, ఈ మొక్క 1950కి ముందు భారత్‌లో లేదు. అమెరికా నుంచి వచ్చిన ఈ మొక్క ఇప్పుడు విపరీతంగా పెరుగుతూ మన దేశ రైతులకు పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ కలుపు మొక్క వెనుక ఓ కథ ఉంది. ఆ ఆసక్తికర కథ మీకోసం..
మన దేశ రైతులకు ఎక్కువగా నష్టం చేసే కలుపు మొక్క ఈ వయ్యారి భామ. పంట పైరుల ఎదుగుదలకు ఇది ఆటంకంగా మారి దిగుబడులు తగ్గిస్తుంది. పత్తి, మొక్కజొన్న, గోదుమ, మల్బరి తోటలు, పూల తోటలు, మామిడి, కూరగాయల తోటల్లో ఈ కలుపు మొక్క ఎక్కువగా పెరుగుతుంది. పంట దిగుబడిని ఏకంగా 40 శాతం మేరకు తక్కువ చేసే అతి కిరాతక కలుపు మొక్క ఈ వయ్యారి భామ.
దీని పుష్పాల నుంచి వచ్చే పుప్పడి రేణువులు మొక్కలపై పడి రైతులు వేసే పంటకు సంబంధించిన పుష్పాలు, పిందెలు రాలిపోతాయి. ఈ మొక్కలు పంటలో తెగుళ్లకు కూడా కారణం అవుతాయి. రైతులు ఆర్థికంగానే కాదు ఆరోగ్యపరంగానూ వయ్యారి భామ కలుపు మొక్కల వల్ల నష్టపోతుంటారు. ప్రమాదకరమైన డర్కాటైటీస్, ఎగ్జిమా, తీవ్ర జ్వరం, ఉబ్బసం, బ్రాంకైటీస్ వంటి వ్యాధులు ఈ మొక్కల వల్ల వస్తాయి. పొలాల్లో పని చేసే రైతులకు ఈ మొక్కల వల్ల చర్మ సమస్యలు కూడా వస్తుంటాయి.
వయ్యారిభామ మొక్క వల్ల పశువులకు కూడా ప్రమాదమే. అందుకే పశువులు ఈ మొక్కను అస్సలు ముట్టుకోవు. ఒకవేళ గడ్డితో కలిపి పొరపాటున తింటే పశువులు కూడా అనారోగ్యం పాలవుతాయి. ఈ కలుపు మొక్క తిన్న పశువుల జీర్ణక్రియ, కిడ్నీ, లివర్, శ్వాసక్రియ దెబ్బతింటాయి. కొన్నిసార్లు పశువులు మరణించే ప్రమాదం కూడా ఉంటుంది. రైతులకు, వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు ఇంత నష్టం చేసే ఈ కలుపు మొక్కను నివారించడానికి రైతులు చాలానే కష్టపడతారు.
కానీ, ఈ కలుపు మొక్క అంత సులువుగా చావదు. పూత పూయకముందే వేర్లతో సహా పీకి బురదలో తొక్కడం లేదా కాల్చడం చేయాలి. కాలుతున్నప్పుడు వచ్చే పొగకు కూడా దూరంగా ఉండాలి. ఇతర నివారణ పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి. ఎన్ని చేసినా వయ్యారి భామను పూర్తిగా నివారించడం కష్టమవుతోంది. ఇది అత్యంత సులభంగా, ఏపుగా పెరుగుతుంది. పక్వానికి వచ్చిన వయ్యారి భామ విత్తనాలు అతి సూక్ష్మంగా ఉంటాయి. ఇవి గాలి ద్వారానే 3 కిలోమీటర్ల వరకు పడి విస్తారంగా ఈ మొక్కలు పెరుగుతాయి. రెండేళ్ల పాటు భూమిలో ఉంటూ అనువైన వాతావరణం రాగానే పెరగడం ఈ కలుపుమొక్కల ప్రత్యేకత.
ఇంత ప్రమాదకర, మన రైతుల పాలిట శాపంగా మారిన వయ్యారి భామ కలుపు మొక్క అసలు మన దేశానికి సంబంధించినది కాదు. ఇది అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండేది. దీనిని అమెరికన్ ఫీవర్ ఫ్యూ అని పిలుస్తారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో భారత్‌లో ఆహారధాన్యాల కొరత విపరీతంగా ఉండేది. ఈ సమయంలో అమెరికా వారి అవసరానికి మించి ఉత్పత్తి అయిన గోదుమలను ఆహార కొరత ఉన్న దేశాలకు అప్పుగా సరఫరా చేసేది. దీనికి పీఎల్ 480 పథకం అనే పేరు ఉంది. ఇలా 1950 నుంచి భారత్‌కు అమెరికా గోదుమలను పంపించేది.
ఇలా పంపించిన గోదుమలతో కలిపి వయ్యారి భామ కలుపు మొక్కల విత్తనాలు కూడా అమెరికా నుంచి భారత్‌లోకి వచ్చాయి. 1956లో మొదట ఈ కలుపు మొక్కను మన దేశంలో గురించారు. మహారాష్ట్ర, బిహార్‌లోనే మొదట ఈ మొక్కలు ఎక్కువగా ఉండేవట. వేగంగా విస్తరించే గుణం ఉండటంతో ఈ మొక్కలు ఇప్పుడు దేశమంతా వ్యాపించాయి. మన గ్రామాల్లో కూడా ఈ మొక్కలు మనకు విరివిగా కనిపిస్తాయి. అయితే, దీనిని కాంగ్రెస్ గడ్డి అని కూడా కొందరు రైతులు పిలుస్తారు. కాంగ్రెస్ హయాంలో అమెరికా నుంచి వచ్చినందుకు ఈ కలుపు మొక్కలను కాంగ్రెస్ గడ్డి అని పిలుస్తారని చెబుతారు.