ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీస్తోంది. పర్యటనకు ఒక్కరోజు ముందే జగన్ ఢిల్లీ టూర్ ఖరారు కావడం, షెడ్యూల్ కంటే గంట ముందే జగన్ ఢిల్లీ బయలుదేరడంతో ఈ టూర్‌కు ఏదో ప్రాధాన్యత ఉందనే చర్చ మొదలైంది. ఇంతలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కొన్ని కథనాలు ప్రసారం చేసింది. అసలు జగన్ ఢిల్లీ వెళ్లాలని అనుకోలేదని, కేంద్ర ప్రభుత్వ పెద్దలే జగన్‌ను ఢిల్లీ పిలిపించారని వార్తలు ప్రసారం చేసింది.
ఢిల్లీకి పిలిచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జగన్‌కు చీవాట్లు పెట్టారని, క్లాస్ పీకారని కూడా ప్రచారం చేశాయి టీడీపీ అనుకూల మీడియా సంస్థలు. కోర్టులపై వైసీపీ వైఖరి పట్ల జగన్‌పై అమిత్ షా సీరియస్ అయ్యారని వార్తలు వేశాయి. ఇదే సమయంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డితో కొందరు అధికారులు మాట్లాడి, పద్ధతి మార్చుకోవాలని చెప్పినట్లుగా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేసింది.
అయితే, టీడీపీ అనుకూల మీడియా చెబుతున్నట్లుగా కాకుండా ఢిల్లీలో పరిస్థితి మరోలా ఉంది. నిజానికి ఇటీవలే అనారోగ్యం పాలై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమిత్ షా.. జగన్‌ను నిన్న సాయంత్రం కలిసిన తర్వాత మళ్లీ ఇవాళ ఉదయం కూడా అరగంట పాటు అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడారు. ఒకేసారి రెండుసార్లు మాట్లాడటం అంటే బాగానే ప్రాధాన్యత ఇచ్చినట్లే లెక్క. ఇక, అమిత్ షాను కలిసిన అనంతరం జగన్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిశారు. ఆయన జగన్‌ను కారు దగ్గరకు వచ్చి మరీ సాగనంపారు. ఈ రెండింటినీ పరిశీలిస్తే టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా జగన్‌పై కేంద్ర పెద్దలు అసంతృప్తిగా, సీరియస్‌గా ఉన్నట్లు ఏమీ కనిపించడం లేదు.