ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సిన్ డ్రైవ్ చేపట్టింది భారత్. అందులో భాగంగా పెద్ద ఎత్తున వాక్సిన్ లను వేసే ప్రక్రియ చేపట్టింది. అయితే భారతీయుల్లో కొందరు ఇక్కడ వాక్సిన్ వేయించుకోవడానికి బదులుగా నేపాల్ కు వెళ్తున్నారు. అందుకు కారణం నేపాల్ లో చైనా వాక్సిన్ లభిస్తుండటమే. మన దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్, కోవిషీల్డ్ వాక్సిన్ లు అందుబాటులో ఉండగా.. రష్యా స్పుత్నిక్ వి వాక్సిన్ కు కూడా ఇటీవలే ఆమోదం లభించింది.
అయితే చైనా తయారు చేసిన వాక్సిన్ పై దేశాలు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో ఎవరైనా సరే తమ దేశంలోకి అడుగుపెట్టాలంటే చైనా వాక్సిన్ ను వేసుకోవాలని ఆ దేశం షరతు విధించింది. దీంతో చైనాతో సంబంధాలు ఉన్న వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు ఆ దేశంతో ఉన్న సంబంధాలను తెంచుకోలేక చైనా వాక్సిన్ వేసుకోవడానికి సిద్దపడుతున్నారు. లేకుంటే ఆ దేశంలోకి తిరిగి అడుగుపెట్టలేమన్న భయం వారిలో నెలకొంది.
అయితే మన దేశంలో చైనా వాక్సిన్ కు అనుమతులు లేవు. పక్కనున్న నేపాల్ లో ఈ వాక్సిన్ వేస్తుండటంతో పెద్ద ఎత్తున భారతీయులు ఆ దేశానికి క్యూ కడుతున్నారు. ఈ మేరకు నేపాల్ లోని ఖాట్మండులో ఓ ఆసుపత్రి ముందు లగేజీలతో ప్రత్యక్షమైన మన వారిని చూసి ఆసుపత్రి వర్గాలు ఖంగుతిన్నాయట. గుర్తింపు కార్డు చూపించమని అడిగితే వారంతా పాసుపోర్టులు చూపించి వాక్సిన్ వేయాలని కోరుతున్నారట.