బ్రిటన్ లో కొత్త రకం మహమ్మారి విజృంభిస్తుంది. ఇప్పటికే ఆ దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీ మొదలైన విషయం తెలిసిందే. అయినా ఊహించని విధంగా కరోనా కొత్త స్ట్రెయిన్ బ్రిటన్ వాసులను వెంటాడుతుంది. రోజుకి లెక్కలేనన్ని కరోనా కేసులు అక్కడ నమోదవుతున్నాయని ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటించారు.
కరోనా మ్యుటేషన్ కారణంగా మునుపటి కన్నా 70 శాతం అధికంగా వైరస్ వ్యాపించే అవకాశం ఉంది. దీంతో బ్రిటన్ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ విధించింది. ఆదివారం నుంచి ప్రజలందరిని ఇంటికే పరిమితం చేసింది. బ్రిటన్ పరిస్థితులు ఆందోళనకరంగా ఉండటంతో ఇతర దేశాలు కూడా అప్రమత్తమవుతున్నాయి.
బ్రిటన్ పరిస్థితి చేయిదాటిపోయిందని ఆ దేశ ఆరోగ్య శాఖా మంత్రి ప్రకటించడంతో పొరుగు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ, బల్గేరియా, ఆస్ట్రియా, కెనడా, ఇటలీ, చెక్ రిపబ్లిక్ దేశాలు బ్రిటన్ విమానాలపై నిషేధం విధించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. అందులో భాగంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధిస్తున్నట్టుగా ప్రకటించింది.
రేపటి నుంచే ఈ నిషేధం అమలులోకి రానుంది. ఈ నెల 31 వ తేదీ వరకు ఈ నిషేధం కొనసాగనుంది. బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత విధానాలు, ఔషదాలు ఈ కొత్త వైరస్ మ్యుటేషన్ పై ప్రభావం చూపుతాయా లేదా అనే విషయంపై పరిశోధనలు జరపవలసిన అవసరం ఉంది. అయితే ఈ కొత్త స్ట్రెయిన్ ప్రాణాంతకమై చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి అధరాలు లేవు.