2020 మన జీవితాలలో అనేక చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఒకరకంగా ఈ సంవత్సరాన్ని విపత్తుల ఏడాదిగా పిలుచుకోవచ్చు. కరోనా మహమ్మారి వల్ల మొత్తం ప్రపంచం అతలాకుతలమైంది 2020లోనే. ఒక్క కరోనా మాత్రమే కాదు, మన దేశంలో 2020 ఇంకా అనేక విషాదాలను, చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.
జేఎన్‌యూలో విధ్వంసం
దేశంలోనే అత్యున్నత విశ్వవిద్యాలయాల్లో ఒకటి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. చదువుల తల్లి ఒడి లాంటి ఈ యూనివర్సిటీలో 2020 జనవరిలో దాష్టీకం జరిగింది. మొదట యూనివర్సిటీ విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయి. తర్వాత దుండగులు ముసుగులతో యూనివర్సిటీలోకి ప్రవేశించి విద్యార్థులపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో అనేక మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఢిల్లీ అల్లర్లు
ఫిబ్రవరిలో దేశ రాజధాని ఢిల్లీ అల్లర్లతో అట్టుడికింది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ, ఎన్ఆర్సీకి అనుకూలంగా, వ్యతిరేకంగా ఢిల్లీలో ఉద్యమాలు జరిగాయి. ఫిబ్రవరి 24న ఈశాన్య ఢిల్లీలో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ఐదు రోజుల పాటు ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు అట్టుడికిపోయాయి. ఈ అల్లర్లలో 53 మంది మరణించారు. అల్లర్లతో సంబంధం ఉన్న 903 మందిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
లాక్డౌన్
దేశంలో కరోనాను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చ్‌లో లాక్డౌన్ విధించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మార్చ్ 24న 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ లాక్డౌన్ పలుమార్లు పొడిగించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే విధించిన లాక్డౌన్ వల్ల వలస కార్మికులు, సాధారణ, పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
వలస కార్మికుల వ్యధ
లాక్డౌన్ కారణంగా నగరాల్లో ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు వందల కిలోమీటర్లు తమ స్వస్థలాలకు నడుచుకుంటూ పోయిన సంఘటనలు ప్రతీ ఒక్కరినీ కలిచివేశాయి. మహిళలు, పసి పిల్లలు సైతం వందల కిలోమీటర్లు నడిచిన దారుణ పరిస్థితులు చూశాం. ఈ క్రమంలోనే మధ్య ప్రదేశ్‌కు చెందిన 16 మంది వలస కార్మికులు తమ స్వగ్రామాలకు నడుచుకుంటూ వెళుతున్న సమయంలో మహారాష్ట్రలోని జాల్నా వద్ద రైలు ప్రమాదానికి గురయ్యారు. 16 మంది వలస కార్మికులు ఈ ప్రమాదంలో మృతి చెందడం ప్రతీ ఒక్కరిని బాధించింది.
విశాఖపట్నం గ్యాస్ లీక్
మే 7న దేశం యావత్తు ఒక విషాద వార్తతో నిద్ర లేచింది. విశాఖలోని ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన గ్యాస్ లీకేజ్ వల్ల 15 మంది అమాయక ప్రజలు మరణించారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీక్ వల్ల ప్రజలు అస్వస్థతకు గురవడం, రోడ్లపై పడిపోవడం వంటివి అందరినీ బాధించాయి.
గల్వాన్ లోయ పోరాటం
దేశ రక్షణ కోసం 20 మంది భారత సైనికులు ప్రాణత్యాగాలు చేశారు. జూన్ 16న లద్ధాక్‌లోని గల్వాన్ లోయలో భారత్ – చైనా సైనికుల మధ్య జరిగిన గొడవలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన గల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. ఈ ఘటనతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
ఏలూరు వింత వ్యాధి
ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో డిసెంబర్ మొదటి వారంలో వింత వ్యాధి సోకింది. వందల మంది ప్రజలు ఈ వ్యాధి బారిన పడి మూర్చపోయి అస్వస్థతకు గురయ్యారు. సుమారు 600 మంది ఈ వ్యాధికి గురయ్యారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేక పరిశోధనలు చేయించిన తర్వాత నీటి కాలుష్యమే ఈ వ్యాధికి కారణమని తేలింది.