పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ ను 2011లో పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో అమెరికా మిలటరీ దళాలు మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఉగ్ర వాదుల చర్యలను పరోక్షంగా సమర్థించుకుంటూ వసున్న పాకిస్థాన్ ద్వంద నీతి ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసొచ్చింది. అంతే కాదు ఎప్పుటినుంచో అమెరికా మిత్ర దేశాల జాబితాలో ఉన్న పాకిస్థాన్ 2001 అమెరికా ఉగ్రదాడుల సూత్రధారి అయిన లాడెన్ కు ఆశ్రయమిచ్చిన విషయం తెలిసి అమెరికాకు కనువిప్పు కలిగింది.
పాకిస్థాన్ లోని అబోటాబాద్ లో లాడెన్ కదలికలను పసిగట్టిన అమెరికా సైన్యం పాకిస్థాన్ కు సమాచారమైనా ఇవ్వకుండా మెరుపు దాడులు చేసి లాడెన్ ను హతమార్చింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే.. ఉగ్రవాదంతో ప్రపంచాన్ని వణికించిన బిన్ లాడెన్ పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కు అమరవీరుడట. పాక్ పార్లిమెంట్ సాక్షిగా ఇమ్రాన్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. అమెరికా సమాచారం ఇవ్వకుండా లాడెన్ ను హతమార్చింది. అవును నేను మాట్లాడుతున్నది అమరవీరుడు బిన్ లాడెన్ గురించి. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పాకిస్థాన్ పౌరులకు ఇబ్బంది కలిగించింది. అమెరికా చేసిన దాడికి అందరూ తమను దూషించారని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తుందని వస్తున్నా ఆరోపణలతో పాక్ ప్రజలు వివక్షను ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు ఇమ్రాన్ లాడెన్ ను కీర్తిస్తూ చేసిన వ్యాఖ్యలు మరింత వివాదాస్పదమవుతున్నాయి. పాకిస్థాన్ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వం పై దుమ్మత్తిపోస్తున్నాయి. ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని పాకిస్థాన్ హక్కుల కోసం పోరాడే మీనా గాబీనా పేర్కొన్నారు.