తెలుగువాడైన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక అమ్మాయి కోసం లేని కష్టాలను కొని తెచ్చుకున్నాడు. గుడ్డి ప్రేమతో అమ్మాయి కోసం నడుచుకుంటూ వెళ్లి పాకిస్తాన్లో ఇరుక్కున్నాడు. అక్కడ ఆర్మీకి చిక్కి వారి చేతిలో చిత్రహింసలకు గురై జైలు జీవితం కూడా గడిపాడు. చివరకు తెలంగాణ పోలీసుల సహాయంతో ఎలాగోలా పాకిస్తాన్ నుంచి బయటపడి తన కుటుంబం వద్దకు చేరుకున్నాడు. ఈ కథంతా ఒక సినిమా కథను మించి ఉంటుంది.
విశాఖపట్నానికి చెందిన బాబూరావు కుటుంబం 12 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. ఆయన కుమారుడు ప్రశాంత్. ఇంజనీరింగ్ పూర్తి చేసి బెంగళూరులో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. 2010లో అక్కడ పని చేస్తున్నప్పుడు మధ్యప్రదేశ్‌కు చెందిన స్వప్నిక పాండే అనే ఒక అమ్మాయిపై మనస్సు పడ్డాడు. మూడేళ్లు ఇద్దరూ కలిసి పని చేశారు. కానీ, ఏనాడు తన ప్రేమ విషయాన్ని ఆ అమ్మాయికి చెప్పే ధైర్యం చేయలేదు. 2013లో ఆ అమ్మాయి ఉద్యోగం మానేసి వెళ్లిపోయింది.
ప్రశాంత్ కూడా హైదరాబాద్‌కు వచ్చేశాడు. కానీ, ఆ అమ్మాయిపైనే తన ఆలోచనలు ఉండేవి. ఎన్ని రోజులైనా ఆ అమ్మాయిని మరిచిపోలేకపోయాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని కలవాలని నిర్ణయించుకొని ఆమె స్వస్థలానికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను కలిసి తన ప్రేమ గురించి చెప్పాడు. కానీ, వారు ప్రశాంత్ ప్రేమకు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయి కూడా అప్పటికే స్విట్జర్లాండ్ వెళ్లిందని ప్రశాంత్‌కు తెలిసింది.
హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కూడా ఎలాగైనా స్విట్జర్లాండ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా వెళ్లాలని పట్టుదల, ధైర్యం ఉంది కానీ సరైన ప్లాన్, కావాల్సిన డబ్బులు మాత్రం ప్రశాంత్ దగ్గర లేవు. స్విట్జర్లాండ్‌కు ఎలా వెళ్లాలని గూగుల్‌లో చూస్తే పాకిస్తాన్ మీదుగా వెళితే 8,400 కిలోమీటర్లు ఉంటుందని, ఇదే దగ్గర రూట్ అని వచ్చింది. దీంతో 2017 ఏప్రిల్ 11న ఇంట్లో ఆఫీసుకు వెళుతున్నానని చెప్పి స్విట్జర్లాండ్‌కు బయలుదేరాడు.
ఫోన్, పర్సు కూడా ఇంట్లోనే పెట్టేసి వెళ్లిపోయాడు. ముందు రైలెక్కి టిక్కెట్ లేకుండా రాజస్థాన్‌లోని బికనీర్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి కాలినడకన ఇండియా – పాకిస్తాన్ బార్డర్ చేరుకున్నాడు. ప్రశాంత్ వద్ద డబ్బులు లేవు. తినడానికి తిండి లేదు. సరిహద్దులో ఇరు దేశాల సైనికులకు దొరక్కుండా రక్షణ కంచె దాటేసి పాకిస్తాన్లో పడ్డాడు. అప్పటికే అలిసిపోయిన ప్రశాంత్ సరిహద్దుకు దగ్గర్లోనే పాక్ భూభాగంలో స్పృహ తప్పి పడిపోయాడు.
రక్షణ కంచె దాటుతున్నప్పుడు ప్రశాంత్ షర్ట్ చినిగి కంచెకు అంటుకుంది. పాక్ సైనికులు అది చూసి ఎవరో అక్రమంగా సరిహద్దు దాటారని గుర్తించి వెంటనే గాలింపు మొదలుపెట్టి ప్రశాంత్‌ను పట్టుకున్నారు. ప్రశాంత్‌ను కొట్టి ఎందుకు బార్డర్ దాటాడో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. లాహోర్‌లోని సైనిక కేంద్రానికి తరలించి రెండేళ్లు అతడిని వారి ఆధీనంలోనే ఉంచుకున్నారు. అయితే, కేవలం ప్రేయసి కోసమే తెలియక ప్రశాంత్ పాకిస్తాన్ వచ్చాడని ఆర్మీ వాళ్లు నమ్మారు.
దీంతో అతడిని కోర్టులో హాజరుపరచగా ఏడాది జైలు శిక్ష పడింది. అప్పటివరకు ప్రశాంత్ జాడ తెలియని కుటుంబసభ్యులకు అతడు పాకిస్తాన్లో ఉన్నట్లు తెలిసింది. దీంతో అతడి తల్లిదండ్రులు సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి తమ కుమారుడిని భారత్ తీసుకురావాలని కోరారు. సజ్జనార్ స్వయంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంశాఖ అధికారులతో మాట్లాడి ప్రశాంత్‌ను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. చాలా రోజుల తర్వాత ఈ ప్రయత్నం ఫలించింది. పాక్‌లో ప్రశాంత్ జైలు జీవితం కూడా ముగిసింది.
దీంతో 2021 మే 31న పాకిస్తాన్ ప్రశాంత్‌ను భారత్‌కు అప్పగించారు. మన పోలీసులు అట్టారి బార్డర్ వద్దకు వెళ్లి ప్రశాంత్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. దీంతో ప్రశాంత్ కథ సుఖాంతం అయ్యింది. గుడ్డి ప్రేమతో ప్రశాంత్ తెచ్చుకున్న కష్టాలు తీరాయి. తనను విడిపించేందుకు కృషి చేసిన వారికి ప్రశాంత్ కృతజ్ఞతలు చెప్పాడు. డబ్బులు లేకే కాలినడకన స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నట్లు ప్రశాంత్ చెప్పాడు. పాక్ సైనికులు తనను చాలా కొట్టి విచారించారని వాపోయాడు. ఇప్పుడు తనకు స్వేచ్ఛ వచ్చిందని చెబుతున్నాడు.