ఏలూరు వింత వ్యాధి ఘటన ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో నగరంలో ఇలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ శ్రీనగర కాలనీలోని ఓ అపార్టుమెంటులో 46మంది అస్వస్థతకు గురవ్వడం కలకలం రేపుతోంది. అపార్టుమెంటు వాసుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా నెగిటివ్ అని తేలడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
30 కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ అపార్టుమెంటులో శుక్రవారం రోజు 46 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వీరంతా వాంతులు, విరేచనాలతో ఆసుపత్రికి పరుగులు తీశారు. అయితే కరోనా నేపథ్యంలో ఏ చిన్న లక్షణం కనిపించినా ప్రజలు హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో అపార్టుమెంటులో కొందరు వైద్య ఆరోగ్య శాఖకు సమాచారమిచ్చారు.
వీరికి జరిపిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ గా తేలింది. అయితే వీరంతా అస్వస్థతకు గురవ్వడానికి కలుషిత నీరే కారణమయ్యి ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. కాగా అక్కడి నీటి శాంపిల్స్ ను సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారంతా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు.