గ్రేటర్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇప్పుడు జీహెచ్ఎంసీ పీఠం అధిష్టించేది ఎవరనే విషయం ఉత్కంఠగా మారింది. ఈసారి మేయర్ సీటు మహిళకే కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది టీఆర్ఎస్. అలాగే 31 ఎక్స్ అఫీషియోల బలం గులాబీ పార్టీకి ఉంది.
అయినా మేయర్ పీఠాన్ని చేరుకోవాలంటే టీఆర్ఎస్ 98 మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవలసి ఉంటుంది. అందుకోసం టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం తో పొత్తుపెట్టుకునే ఆకాశం లేకపోలేదు. అయితే మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది పోటీ పడగా అందులో ఆరుగురు మాత్రం విజయం దక్కించుకున్నారు.
అయితే వీరిలో మహిళా మేయర్ అభ్యర్థిగా భారతీనగర్ డివిజన్ వి. సింధు రెడ్డి పేరు అధికంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో సింధు రెడ్డికి శుక్రవారం ప్రగతి భవన్ నుంచి పిలుపు అందింది. దీంతో ఆమెనే మేయర్ పీఠాన్ని దక్కించుకోనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. అయితే మేయర్ పీఠాన్ని ఆశిస్తున్నవారిలో మరికొందరు మహిళామణులు కూడా ఉన్నారు. వీరంతా ఆయా డివిజన్లలో ప్రజల మెప్పు పొంది రెండోసారి గెలిచినవారే.
మేయర్ పీఠం ఆశిస్తున్నవారిలో టీఆర్ఎస్ నాయకుడు మన్నె గోవర్ధన్ రెడ్డి భార్య, వెంకటేశ్వర్ నగర్ కార్పొరేటర్ మన్నె కవిత రెడ్డి ఉన్నారు. మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి మరణం తరువాత ఆయన కోడలు విజయ శాంతి మేయర్ సీటును దక్కించుకోవాలని ఆశపడుతుంది. ఎంపీ కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్ కార్పొరేటర్, దివంగత కాంగ్రెస్ నేత పి. జనార్దన్ రెడ్డి కుమార్తె విజయారెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి కూడా ఉన్నారు. అయితే ప్రగతి భవన్ నుంచి వి. సింధు రెడ్డికి పిలుపు అందడంతో ఆమెను ఈ పదవి వారించే అవకాశాలు గట్టిగా ఉన్నట్టు సమాచారం అందుతుంది.