గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భాగ్యనగరం అతలాకుతలం అయ్యింది. వరద నీరు వీధులు, ఇళ్లలోకి చేరడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. అయితే ప్రజలను అనుక్షణం అప్రమత్తం చేస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటున్న పోలీసులకు కూడా వరద కష్టాలు తప్పడం లేదు. హైద్రాబాద్ సీపీ అంజనీ కుమార్ ఇంట్లోకి కూడా వరద నీరు చేరడంతో ఆయన గత నాలుగు రోజులుగా కార్యాలయంలో ఉంటూనే పని చేస్తున్నారు.
300 పోలీసు కుటుంబాలు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అయినా వారు కుటుంబాలను విడిచి నగరంలో రెస్క్యూ ఆరేషన్ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నారు. నగరంలోని ప్రస్తుత పరిస్థితిని వివరించిన అంజనీ కుమార్ మూసి లోతట్టు గల ప్రాంతాల్లో ఇంకా వరద నీరు ఉందన్నారు.
వరదలో చిక్కుకున్న కుటుంబాలను రెస్క్యూ ఆపరేషన్ ద్వారా కాపాడినట్టుగా ఆయన తెలిపారు. అయితే ప్రజలు అత్యవసర పరిస్థితులు ఎదురైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రాకూడదని సీపీ అంజనీ కుమార్ ప్రజలను హెచ్చరించారు.