సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు తరలి వెళుతున్నారు. ఈ సందర్భంగా హైద్రాబాదు సీపీ అంజనీ కుమార్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. పండగ సెలవులకు ఊర్లకు వెళ్తున్న విషయాన్ని ఎవ్వరూ సోషల్ మీడియాలో వెల్లడించవద్దని తెలిపారు. ఊర్లకు వెళ్లేవారు ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు రాచకొండ పోలీసులు నగరవాసులకు కొన్ని సూచనలు చేసారు.
ఊర్లకు ప్రయాణం అయ్యే వారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు:
- ఇంట్లో ఉన్న విలువైన వెండి బంగారు ఆభరణాలు బీరువాలో లాకర్లలో దాచకండి. వాటిని ముందుగానే బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకుని వెళ్ళండి.
- ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ చేసి, బయట గొల్లం పెట్టకండి.
- మీరు ఊరు వెళ్తున్న విషయాన్నీ ముందగా పోలీసులకు గాని, మీకు నమ్మకస్తులైన పక్కింటి వారికీ గాని సమాచారం అందించండి.
- ఇంటికి తాళం వేసి తాళం కనిపించకుండా తాళం కప్పండి.
- వీలైనంత వరకు ఇంట్లో లైట్లు వేసి ఉంచండి.
- ఇంటి ముందు చెప్పులను వదిలి ఉంచండి.
- గేటుకు లోపలి నుంచి తాళం వేయండి.
- పేపర్ బాయ్, పాల ప్యాకెట్లు వేసే వ్యక్తిని రావద్దని చెప్పండి.
- మీ ఇంట్లో మరియు మీ కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోండి.
- మీకు ఎవరిమీదైనా అనుమానం వస్తే 100 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సమాచారం అందించండి.