కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అంటే భక్తులకు ఎంతో ప్రీతి. స్వామివారిని ఎంత గొప్పగా పూజిస్తారు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా అంతే ఇష్టపడతారు భక్తులు. అయితే, లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా తిరుమల వెంకన్న దర్శనానికి భక్తులు దూరమయ్యారు. అయితే, దర్శన భాగ్యం కల్పించలేకపోయినా భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అయినా అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్ణయించింది.
దీంతో పెద్ద ఎత్తున లడ్డూలను తయారు చేసి ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లా కేంద్రాల్లోని టీటీడీ కళ్యాణవేదికలు, సమాచార కేంద్రాల్లో విక్రయిస్తున్నారు. సోమవారం ప్రారంభమైన లడ్డూ విక్రయాలకు భక్తుల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. స్వామి వారి ప్రసాదం కోసం విక్రయ కేంద్రాల వద్ద భక్తులు క్యూ కట్టారు. దీంతో ఒక్క రోజులోనే 2.4 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది.
కాగా, సబ్సిడీ రేట్లతో లడ్డూలను అందిస్తోంది టీటీడీ. సాధారణంగా రూ.50 ఉండే లడ్డూను సగం ధరకే రూ.25కే భక్తులకు విక్రయిస్తోంది. లడ్డూ విక్రయాల కోసం లాక్డౌన్ నిబంధనలను, కరోనా వైరస్ వ్యాపించకుండా జాగ్రత్తలను టీటీడీ తీసుకుంటోంది. త్వరలోనే హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోనూ లడ్డూ విక్రయాలు జరిపేందుకు టీటీడీ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదిస్తోంది.