దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయనుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సిన్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 ఏళ్లు పైబడిన వారందరికి కూడా కరోనా వాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబందించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ను మొదట మే 1 వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలిపింది. ఏప్రిల్ 24 వ తేదీ నుంచే రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా కరోనా వాక్సిన్ తీసుకోవడానికి అర్హులు.
అయితే టీకా తీసుకోవాలనుకునేవారు ముందస్తుగా కేంద్రం అధికారిక వెబ్సైట్ కొవిన్‌లో లేదా ఆరోగ్య సేతు యాప్ లో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. అందుకోసం సెర్చ్ ఇంజన్‌లోకి వెళ్లి cowin.gov.in లో లాగిన్ అవ్వాలి. ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ వెంటనే ఓ ఒటిపి నెంబర్ వస్తుంది. ఒటిపి ఎంటర్ చేయగానే..వెరిఫై బటన్‌పై క్లిక్ చేయాలి.
వెరిఫై చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫ్ వాక్సిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు,పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ అనే బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వాక్సిన్ వేసుకోవడానికి మీకు అనువైన తేదీ సమయాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. పిన్ కోడ్ ద్వారా మీకు దగ్గరలోని వ్యాక్సినేషన్ సెంటర్లను సెర్చ్ చేస్తే ఆ లిస్టు కనిపిస్తుంది. ఆ తర్వాత మీరు ఎంచుకున్న తేదీ సమయాన్ని సరి చూసుకుని కంఫర్మ్ చేయాలి. ఒక సారి లాగిన్ అయిన వారు వారితో కలిపి నలుగురికి రిజిస్టర్ చేసుకోవచ్చు. అవసరమైతే మీ అపాయింట్ మెంట్ తేదీలలో మార్పులు కూడా చేసుకోవచ్చు.