మన ఆర్థిక అవసరాలకు లోన్ కావాలన్నా, ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనాలన్నా సిబిల్ స్కోర్ అతి ముఖ్యమైనది. సిబిల్ స్కోర్ ఉంటేనే మనకు ఏ లోన్ అయినా వస్తుంది. కాబట్టి, సిబిల్ స్కోర్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ఏం చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుంది ? ఏం చేస్తే పెరుగుతుంది ? వంటి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.
సిబిల్ స్కోర్‌ను సరిగ్గా మెయిన్‌టెయిన్ చేయడం అనేది చాలా ముఖ్యం. 300 నుంచి 900 పాయింట్ల మధ్యన సిబిల్ స్కోర్ ఉంటుంది. 750 పాయింట్ల కంటే ఎక్కువగా మన స్కోర్ ఉంటే లోన్లు ఏవైనా సులభంగా ఇస్తారు. కొందరికి తెలిసో, తెలియకో చేసిన కొన్ని తప్పుల వల్ల సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు సిబిల్ స్కోర్ పెంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే క్రమంగా స్కోర్ పెంచుకోవచ్చు.
సిబిల్ స్కోర్ బాగుండాలంటే ముందుగా కచ్చితంగా చేయాల్సింది ఉన్న ఈఎంఐలను సమయానికి చెల్లించడం. ఈఎంఐల చెల్లింపు సిబిల్ స్కోర్‌పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. టైమ్‌కు పేమెంట్ చేస్తే స్కోర్ పెరుగుతుంది. ఒకవేళ టైమ్‌కి చెల్లించకపోతే స్కోర్ తగ్గిపోతుంది.
లోన్ల కోసం, క్రెడిట్ కార్డుల ఎక్కువగా అప్లై చేసినా, పదే పదే అప్లై చేసినా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. మనం ఎన్నిసార్లు లోన్ల కోసం అప్లై చేస్తున్నామనేది రికార్డ్ అవుతుంది. ఎక్కువ సార్లు అప్లై చేయడం అంటే మనకు డబ్బు ఎక్కువగా అవసరం ఉందని అర్థం. ఇలా చేస్తే స్కోర్ తగ్గుతుంది. ఒకవేళ ఒకసారి మీ లోన్ అప్లికేషన్ రిజక్ట్ అయితే వెంటనే మళ్లీ అప్లై చేయొద్దు. కనీసం 2- 3 నెలలు ఆగి అప్లై చేయాలి.
క్రెడిట్ కార్డు బిల్లులు సరైన సమయంలో చెల్లిస్తే సిబిల్ స్కోర్ పెరుగుతుంది. అయితే, కొందరు మినిమం పేమెంట్లు ఎక్కువగా చేస్తుంటారు. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గుతుంది. కాబట్టి, మొత్తం పేమెంట్ చేయడమే మంచిది. ఇలా చేస్తే ఛార్జీలు కూడా పడవు. మినిమం పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఎక్కువగా పడుతుంది.
క్రెడిట్ కార్డు లిమిట్ ఎంత ఎక్కువగా వాడితే అంత సిబిల్ తగ్గిపోతుంది. ఉదాహరణకు ఒక లక్ష రూపాయల కార్డు లిమిట్ ఉంటే రూ.30 వేలకు మించి వాడకపోవడం మంచిది. ఇలా 30 శాతం కంటే తక్కువ వాడుకొని సరిగ్గా పేమెంట్ చేస్తే కార్డు లిమిట్ పెరగడంతో పాటు సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది.
ఒకేసారి ఎక్కువ లోన్లు, క్రెడిట్ కార్డులు తీసుకున్నా కూడా సిబిల్ స్కోర్ తగ్గుతుంది. అలాగని అసలు లోన్లే తీసుకోకపోతే సిబిల్ స్కోర్ పెరగదు. కొందరు లోన్లే లేవు కాబట్టి సిబిల్ ఎక్కువగా ఉంటుందని అనుకుంటారు. ఇది పొరపాటు. లోన్లు తీసుకోవాలి. కానీ, ఒక లోన్ అయిపోయిన తర్వాత ఇంకో లోన్ తీసుకుంటే సిబిల్ పెరుగుతుంది.
క్రెడిట్ హిస్టరీ ఎంత ఎక్కువ ఉంటే అంత సిబిల్ స్కోర్ బాగుంటుంది. అంటే, మనం లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకొని ఎంత ఎక్కువ కాలం అయితే అంత సిబిల్ పెరుగుతుంది.కొందరు పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసేస్తారు. ఇలా చేయడం కంటే అవసరం లేకపోతే వాడకుండా ఉంటే మంచిది.
క్రెడిట్ కార్డు పేమెంట్లు, లోన్ల ఈఎంఐలు కట్టడం ఒక్కోసారి మనం మరిచిపోతుంటాం. ఇలా జరిగితే సిబిల్ స్కోర్ తగ్గడంతో పాటు అనవసరంగా ఫైన్లు, చెక్ బౌన్సు ఛార్జీలు కట్టాల్సి వస్తుంది. కాబట్టి, పేమెంట్లు, ఈఎంఐలు గుర్తు పెట్టుకోవడానికి క్యాలెండర్లో రిమైండర్లు పెట్టుకోవడం మంచిది.