logo

  BREAKING NEWS

రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |   గుడ్‌న్యూస్‌.. క‌రోనా ముక్కు వ్యాక్సిన్ సూప‌ర్‌  |   ఈ కిట్‌తో మ‌న‌మే క‌రోనా టెస్టు చేసుకోవ‌చ్చు.. ధ‌ర ఎంతో తెలుసా ?  |  

క‌రోనా టెస్టులు ఎన్ని ర‌కాలు ? అవి ఏంటి ? ఎలా చేస్తారు ? ధ‌ర ఎంత ?

దేశంలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ రావ‌డానికి మ‌రో ఆరు నెల‌లు స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వైర‌స్ వ్యాప్తికి అడ్డుక‌ట్ట వేయడానికి టెస్టింగ్‌, ట్రేసింగ్‌, ట్రీట్‌మెంట్ విధానాన్ని ప్ర‌భుత్వాలు అమ‌లు చేస్తున్నాయి. వైర‌స్ వ్యాప్తిని నివారించాలంటే టెస్టులు ఎక్కువ‌గా జ‌ర‌పాలి. అందుకే ప్ర‌భుత్వాలు టెస్టుల సంఖ్య‌ను పెంచుతున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు క‌రోనాను గుర్తించేందుకు ఏయే టెస్టులు చేస్తున్నారు ? ఎలా చేస్తారు ? వాటి ఫ‌లితాలు ఎప్పుడు వ‌స్తాయి ? ఖ‌ర్చు ఎంత అవుతుంది ? వ‌ంటి అనేక ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానా‌లు ఇవి.

ఆర్‌టీ – పీసీఆర్ టెస్టు
ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్‌ను గుర్తించ‌డానికి ఎక్కువ‌గా ఆర్‌టీ – పీసీఆర్ టెస్టుల‌పైనే ఆధార‌ప‌డుతున్నారు. వైర‌స్ ఉంటే ఈ టెస్టు కచ్చితంగా గుర్తిస్తుంది. అందుకే ఐసీఎంఆర్ కూడా ఈ విధానాన్ని ప్రామాణికంగా భావిస్తోంది. ఆర్‌టీ – పీసీఆర్ అంటే రియ‌ల్ టైమ్ – పోలిమేరేస్ ఛైన్ రియాక్ష‌న్ అని అర్థం. ముక్కు లేదా నోటి లోప‌లి నుంచి స్వాబ్ సేక‌రించి ఈ ప‌రీక్ష జ‌రుపుతారు. క‌రోనా వైర‌స్‌లో ఆర్ఎన్ఏ.. అంటే రిబోన్యుక్లియిక్ యాసిడ్‌ అనే జ‌న్యు ప‌దార్థం ఉంటుంది. ర‌సాయ‌న చ‌ర్య‌ల ద్వారా ఈ వైర‌స్ జ‌న్యు ప‌దార్థం ఉందో లేదో గుర్తిస్తారు. ల‌క్ష‌ణాలు లేని వారిలో కూడా ఆర్‌టీ – పీసీఆర్ వైర‌స్ ఉంటే గుర్తించ‌గ‌లదు. ఈ టెస్టుకు నాలుగు నుంచి ఎనిమిది గంట‌ల స‌మ‌యం ప‌డుతుంది. ఈ టెస్టులు చేయ‌డానికి ప్ర‌త్యేకమైన ల్యాబ్‌లు, సుశిక్షితులైన టెక్నీషియ‌న్స్ అవ‌స‌రం. మిగ‌తా అన్ని క‌రోనా టెస్టుల కంటే ఆర్‌టీ – పీసీఆర్ టెస్టు ఖ‌రీదైన‌ది. ఒక్కో ప‌రీక్ష‌కు సుమారు రెండు నుంచి నాలుగున్న‌ర వేల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది.

ర్యాపిడ్‌ యాంటీజెన్ టెస్టు
త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ టెస్టులు చేసేందుకు యాంటీజెన్ టెస్టు విధానం ఉప‌యోగ‌ప‌డుతుంది. కేవ‌లం 30 నిమిషాల్లోనే ఈ ప‌రీక్ష‌ల ద్వారా ఫ‌లితం తెలుస్తుంది. ముక్కు నుంచి స్వాబ్ సేక‌రించి ఈ ప‌రీక్ష జ‌రుపుతారు. సేక‌రించిన స్వాబ్‌ను వైర‌స్‌ను డీయాక్టివేట్ చేసే ఒక ర‌సాయనంలో పెడ‌తారు. ఈ ర‌సాయ‌నం ద్వారా ప‌రీక్ష జ‌రిపితే ఫ‌లితం తెలుస్తుంది. అయితే, ఇందులో అక్యురెసీ రేట్ త‌క్కువ‌. సేక‌రించే స్వాబ్ శాంపిల్‌లో ప‌రీక్ష జ‌ర‌ప‌డానికి కావాల్సిన యాంటిజెన్ మెటీరియ‌ల్ లేక‌పోతే ఫ‌లితం నెగ‌టీవ్‌గా వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. అందుకే ఒక‌వేళ యాంటీజెన్ ప‌రీక్ష‌లో నెగ‌టీవ్ వ‌చ్చినా మ‌ళ్లీ ఆర్‌టీ – పీసీఆర్ ప‌రీక్ష‌లు చేయించుకుంటే పాజిటీవ్ వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయి. ఒక‌వేళ యాంటీజెన్ ప‌రీక్ష‌లోనే పాజిటీవ్‌గా తేలితే ఇంకా ఏ ప‌రీక్ష అవ‌స‌రం లేకుండానే క‌రోనా పాజిటీవ్‌గా గుర్తించ‌వ‌చ్చు. కంటైన్‌మెంట్ క్ల‌స్ట‌ర్లు, హెల్త్ కేర్‌లో ప‌ని చేసే వారికి పెద్ద ఎత్తున ప‌రీక్ష‌లు జ‌ర‌పాల్సి ఉంటుంది కాబ‌ట్టి యాంటీజెన్ ప‌రీక్ష‌లు జ‌రుపుతున్నారు. ఈ ప‌రీక్ష‌ల కోసం పెద్ద ల్యాబ్‌లు కూడా అవ‌స‌రం లేదు. కేవ‌లం రూ.450కి దొరికే కిట్ ద్వారా ప‌రీక్ష పూర్త‌వుతుంది.

యాంటీ బాడీ టెస్టు
పెద్ద ఎత్తున ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌డానికి, ఒక స‌మూహంలో వైర‌స్ వ్యాప్తిని అంచ‌నా వేయ‌డానికి ర్యాపిడ్ యాంటీ బాడీ టెస్టులు జరుపుతున్నారు. క‌రోనా వైర‌స్ శ‌రీరంలో ఉంటే మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి ఆ వైర‌స్‌ను ఎదుర్కునే యాంటీబాడీల‌ను శ‌రీరంలో త‌యారు చేస్తుంది. ఈ యాంటీబాడీ టెస్టు చేస్తే మ‌నిషి ర‌క్తంలో క‌రోనాను ఎదుర్కునే యాంటీబాడీస్‌ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఈ టెస్టు చేయ‌డానికి ర‌క్త‌న‌మూనాలు సేక‌రిస్తారు. ర‌క్తంలో క‌రోనా యాంటీబాడీస్ ఉంటే ఆ మ‌నిషి వైర‌స్ బారిన ప‌డిన‌ట్లు లెక్క‌. క‌రోనా వైర‌స్‌ను గుర్తించేందుకు ఇది ఇన్‌డైరెక్ట్ ప‌ద్ధ‌తి. ఈ ఫ‌లితాలు వంద శాతం క‌చ్చిత‌త్వంతో ఉంటాయ‌ని చెప్ప‌లేం. పైగా వైర‌స్ బారిన ప‌డిన 9 నుంచి 28 రోజుల్లో ర‌క్తంలో యాంటీబాడీస్ ఏర్ప‌డ‌తాయి. అంటే వైర‌స్ సోకిన 9 రోజుల లోపు ఈ ప‌రీక్ష జ‌రిపితే నెగ‌టీవ్ వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. కేవ‌లం అర‌గంట‌లో ఈ ప‌రీక్ష ఫ‌లితాలు వ‌స్తాయి. రూ.500 ఖ‌రీదు చేసే టెస్టు కిట్ ద్వారా ఈ ప‌రీక్ష పూర్త‌వుతుంది.

ట్రూనాట్ టెస్టు
మే 19వ తేదీ నుంచి ఐసీఎంఆర్ ట్రూనాట్ టెస్టుల‌కు అనుమ‌తి ఇచ్చింది. కేవ‌లం అర‌ గంటలో ఈ టెస్టుల ఫ‌లితం వ‌స్తుంది. టీబీని గుర్తించ‌డానికి చేసే కార్టిడ్జ్ బేస్డ్ – న్యూక్లియిక్ యాసిడ్ యాంప్లిఫికేష‌న్ టెస్ట్ నుంచి ట్రూనాట్ టెస్టు విధానాన్ని అభివృద్ధి చేశారు. ట్రూనాట్ అనేది చిప్ ఆధారంగా ప‌ని చేసే ఒక యంత్రం. నోరు లేదా ముక్కు నుంచి సేక‌రించే స్వాబ్ శాంపిల్‌ను ఒక ర‌సాయ‌నంలో క‌లిపి అందులో క‌రోనా వైర‌స్ జ‌న్యు ప‌దార్థాలు ఉన్నాయో లేవో ట్రూనాట్ యంత్రం ద్వారా గుర్తిస్తారు. ట్రూనాట్ కిట్ సుమారు రూ.1000 నుంచి రూ.1200 వ‌ర‌కు ఉంటుంది. పెద్ద ఎత్తున ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌డానికి ట్రూనాట్ టెస్టు ఉప‌యోగ‌ప‌డుతుంది.

Related News