హైదరాబాద్, మిర్యాలగూడ ఘటనలు మరవకముందే ఇప్పుడు కర్నూలు జిల్లా ఆదోనిలో పరువు హత్య కలకలం రేపుతోంది. స్థానికంగా ఫిజియో థెరపిస్ట్ గా పని చేస్తున్న ఆడం స్మిత్ అనే దళిత యువకుడిని భార్య తరపు బంధువులు పట్టపగలే దారుణంగా హత్య చేసారు. ఆడం స్మిత్ రెండు నెలల క్రితమే అదే గ్రామానికి చెందిన మహేశ్వరిని కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ గత ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.
ఆ విషయం తెలియని మహేశ్వరీ తల్లిదండ్రులు ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయించారు. పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోరని భావించిన మహేశ్వరీ ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ ఆర్య సమాజ్ లో ఆడం స్మిత్ ను పెళ్లి చేసుకుంది. అనంతరం పెద్దల నుంచి తమకు ప్రాణహాని ఉందని కర్నూలు ఎస్పీని కలిసి రక్షణ కోరారు. మహేశ్వరీ తల్లిదండ్రులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
వీరిద్దరూ తమ గ్రామానికి వస్తే తమ పరువు పోతుందని కౌన్సెలింగ్ సందర్భంగా వారు పోలీసులను కోరడంతో భార్యాభర్తలిద్దరిని కర్నూలు పట్టణంలోనే ఉంచారు పోలీసులు. అయినా వీరికి పెద్దల నుంచి హత్యా బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం కేక్ తేవడానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఆడంస్మిత్ ను నడి రోడ్డుపై అడ్డగించి బండరాయితో కొట్టి హతమార్చారు. తన భర్తను తన తండ్రి, బాబాయిలే చంపారని మహేశ్వరీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కారణంగా భర్త హత్యకు గురికావడంతో ఆడం స్మిత్ తండ్రి కాళ్లపై పడి తనను క్షమించాలంటూ మహేశ్వరీ రోదించిన తీరు కంటతడి పెట్టిస్తుంది.