లావుగా ఉన్న వారికి పొట్ట ఉండటం ఎలాగూ ఇబ్బంది పెడుతుంది. కొందరు ఏమంత లావు లేకపోయినా కూడా పొట్ట ఎక్కువగా ఉండి ఆయాస పడుతుంటారు. మరికొందరు ఇంతకుముందు లావుగా ఉండి ఇప్పుడు సన్నబడినా పొట్ట మాత్రం లావుగానే ఉండిపోతుంది. పొట్ట వల్ల అందంగా కనిపించకపోవడం ఒక సమస్య అయితే, ఆయాసం అసలు సమస్య. దీంతో పొట్ట తగ్గించుకోవడానికి అందరూ చాలా ప్రయత్నాలు చేస్తుంటారు.
పొట్ట తగ్గించుకోవడానికి మార్గాలు వెతికే ముందు పొట్ట ఎందుకు వస్తుందనే కారణాలు తెలుసుకోవాలి. ఈ కారణాలు తెలిస్తే పొట్ట తగ్గించుకోవడం సులువవుతుంది. చాలామంది ఎక్కువ తినడం వల్ల పొట్ట వస్తుందని అనుకుంటారు కానీ పొట్ట రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా మనం తినేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా పొట్ట వస్తుంది. అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగినా, ఎక్కువగా నీళ్లు తాగి వెంటనే అన్నం తిన్నా పొట్ట వస్తుంది. ఎక్కువగా తాగిన నీళ్లు, తిన్న ఆహారంతో పొట్ట నిండిపోయి సాగుతుంది.
అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయనేది తెలిసిన విషయమే. అన్నం ఎక్కువగా తినేవారికి సహజంగానే పొట్ట వస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కూడా పొట్ట వస్తుంది. లేట్ నైట్ తినడం, తినగానే పండుకోవడం పొట్ట రావడానికి ప్రధాన కారణం. ఇక అందరికీ తెలిసినట్లుగానే కూర్చొని కదలకుండా పని చేసే వారికి కూడా పొట్ట ఎక్కువగా వస్తుంది.
పొట్ట రావడానికి కారణాలు తెలుసుకొని మన అలవాట్లు మార్చుకుంటే పొట్ట సులభంగా తగ్గించుకోవచ్చు. అన్నం తినడానికి 20 నిమిషాల ముందు నుంచి అన్నం తిన్నాక గంట సేపటి వరకు ఎక్కువగా నీళ్లు తాగవద్దు. తినేటప్పుడు కూడా ఎన్ని తక్కువ నీళ్లు తాగితే అంత మంచిది. అన్నం ఎక్కువగా తినడం వల్ల పొట్ట వస్తుంది కాబట్టి అన్నం తగ్గించి పుల్కా తినడం, భోజనంలో అన్నం తగ్గించి కూర ఎక్కువగా తినడం వల్ల పొట్ట తగ్గుతుంది.
ఉదయం పూట వేయించిన టిఫిన్లను పూర్తిగా తగ్గించేయాలి. టిఫిన్‌గా మొలకెత్తిన విత్తనాలు తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రాత్రి భోజనం వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. రాత్రి తినగానే వెంటనే పడుకోకూడదు. రాత్రి తిన్నాక కనీసం గంట నుంచి రెండు గంటల సమయం తర్వాతే పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువగా లావుగా ఉన్న వారు రాత్రి వేళ అన్నం బదులు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే దానిమ్మ, బొప్పాయి, పుచ్చపండు లాంటి పండ్లు తింటే మంచిది. వీటితో పాటు స్టమక్ ఎక్సర్సైజులు, యోగాసనాలు చేయడం ద్వారా పొట్టను వేగంగా తగ్గించుకోవచ్చు.