కొందరికి తుమ్ములు అదే పనిగా వస్తుంటాయి. ఉదయం పూట అయితే మరీ ఎక్కువగా వస్తాయి. నిజానికి తుమ్ములు రావడం ఆరోగ్యానికి అంత హానికరం ఏమీ కాదు. కానీ, మనలో చాలామంది తుమ్మడం అపశకునం అని భావిస్తూ ఉంటారు. ఈ కారణంతోనే తుమ్మును ఆపుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, ఎప్పుడో ఒకసారి తుమ్మడం ఆరోగ్యానికి మంచిదే కానీ రోజూ 30 – 40 సార్లు తుమ్ముతున్నారు అంటే ఏదో సమస్య ఉందనే అర్థం. ముక్కులో రొంప ఎక్కువగా పేరుకొని ఉంటే శ్వాస తీసుకోవడానికి ఆటంకం ఏర్పడుతుంది.
ఇటువంటప్పుడు మనం శరీరం మనల్ని తుమ్మించి ముక్కులో పేరుకుపోయిన రొంపను బయటకు తెస్తుంది. తద్వారా శరీరానికి శ్వాస సక్రమంగా అందేలా చేస్తుంది. అందుకే తుమ్మడం మంచిదే. అప్పుడప్పుడు తుమ్ము వస్తే తుమ్మాలి కానీ ఆపుకోవడానికి ప్రయత్నించవద్దని వైద్యులు చెబుతుంటారు. తుమ్ములను తాత్కాలికంగా ఆపుకోవడం వల్లనే అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంటుంది. తుమ్మకుండా ఉంటే ముక్కులో పేరుకుపోయిన రొంప వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి.
ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడే అసలు తుమ్ముల జబ్బు మొదలవుతుంది. అదే పనిగా తుమ్ములు వస్తుంటాయి. మరికొందరికి మంచు, చలి ప్రదేశాలకు వెళితే తుమ్ములు అదే పనిగా వస్తుంటాయి. మరికొందరికి దుమ్ము, పొగ వల్ల కూడా తుమ్ములు వస్తాయి. ఇలాంటి సమస్యల వల్ల ఎక్కువగా తుమ్ములు వస్తున్నట్లయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే నెల రోజుల్లో తగ్గిపోతాయి.
దీర్ఘ శ్వాస వల్ల ముక్కులో రొంప వెళ్లిపోతుంది. కాబట్టి, మీ వయస్సు సహకరిస్తే ప్రతీరోజూ ఉదయం కనీసం అరగంట పాటు స్పీడ్ వాకింగ్ లేదా జాగింగ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు దీర్ఘశ్వాస తీసుకుంటూ ఉండాలి. దీర్ఘ శ్వాస తీసుకునే ఎక్సర్సైజులు, యోగాసనాలు కూడా ఇందుకు బాగా పని చేస్తాయి. తుమ్ములు ఎక్కువ వచ్చే సమస్యకు ఆవిరి పెట్టుకోవడం సరైన మందు. ప్రతీరోజు ముఖానికి ఏదైనా నూనె రాసుకొని 10 నిమిషాల పాటు రెండు పూటలా ఆవిరి పెట్టుకోవాలి. ఇప్పుడు కరోనా సమయంలోనూ ఆవిరి పెట్టుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నందున ప్రతీ రోజు రెండుసార్లు ఆవిరి పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి.
మంచినీళ్లు తక్కువగా తాగేవారికి కూడా తుమ్ములు ఎక్కువ వచ్చే సమస్య ఉంటుంది. కాబట్టి ప్రతీరోజూ కనీసం ఐదు లీటర్ల మంచినీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. అయితే, చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం అస్సలు తాగొద్దు. గోరు వెచ్చటి నీళ్లు తాగడం మంచిది. ఫ్రిడ్జ్ వాటరే కాదు ఫ్రిడ్జ్‌లో పెట్టే చల్లటివి ఏవీ తినకూడదు, తాగకూడదు. ఇలా చిన్న చిన్న జాగ్రత్తల వల్ల తుమ్ములు ఎక్కువగా రావడం అనే సమస్యను సులువుగా దూరం చేసుకోవచ్చు.