మహిళలు ఎదుర్కునే ఆరోగ్య సమస్యల్లో రుతు శూల కూడా ఒకటి. రుతుక్రమం మొదలయ్యే రెండు రోజుల ముందు నుంచే కొందరు మహిళల్లో పొత్తి కడుపులో నొప్పి మొదలవుతుంది. ఆ తరువాత రుతుస్రావం మొదలైన మూడవ రోజు వరకు కొనసాగుతుంది. రుతుక్రమం సరైన సమయంలో రాకపోయినా కూడా విపరీతమైన నొప్పి కలుగుతుంది. ఈ బాధ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్ లను ఆశ్రయిస్తుంటారు.
కానీ ఇన్ని రోజులపాటు వీటిని వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని హోమ్ రెమెడీస్ ను ట్రై చేయవచ్చు. ఇవి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలిగించడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగించవు. అవేంటో తెలుసుకుందాం..
నెలసరి నొప్పిని తగ్గించడంలో ఇంగువ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ సమయంలో ఒక కప్పు మజ్జిగలో కొద్దిగా ఇంగువ, మెంతుల పొడి, చిటికెడు ఉప్పు కలిపి తాగితే పొత్తికడుపులో నొప్పి ఇట్టే మాయం అవుతుంది. అంతేకాదు నెలసరి కారణంగా వచ్చే తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. కలబంద గుజ్జుకు పంచదార కలిపి ఒక టీస్పూను తీసుకున్నా వెంటనే నొప్పి కంట్రోల్ అవుతుంది. అలా కుదరని వారు వేడి పాలలో చిటికెడు పసుపు వేసి తాగాలి.
పసుపులో ఉండే నొప్పిని తగ్గించే ఏజెంట్లు నెలసరి నొప్పిని తగ్గించడంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి. వీటితో పాటుగా ప్రతి రోజు వ్యాయామం చేయడం వల్ల నెలసరి సమయంలో అసౌకర్యం కలగకుండా చూసుకోవచ్చు. వ్యాయామం వల్ల శరీరంలోని కండరాలు ఉత్తేజితమై ఆ సమయంలో నొప్పి కలగకుండా చేస్తాయి. హాట్ కంప్రెషన్లు, కోల్డ్ కంప్రెషన్ల ద్వారా కూడా పొత్తి కడుపులో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. నెలసరి నొప్పికి ప్రధాన కారణాల్లో మానసిక ఒత్తిడి కూడా ఒకటి. అందుకే ఈ సమయంలో వీలైనంత ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి.